
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఓ పెద్ద క్రికెట్ అభిమాని అన్న విషయం తెలిసిందే. తరుచూ క్రికెట్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ కీదాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌లో డిసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) అనేది గొప్ప ఆవిష్కరణని అభిప్రాయపడ్డారు. అయితే తొలుత ఈ టెక్నాలజీని సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ వ్యతిరేకించారని, అది తనకు ఏ మాత్రం నచ్చలేదని శశిథరూర్ చెప్పుకొచ్చారు. అసలు ఈ పద్దతిని భారత జట్టు ఎందుకు వ్యతిరేకించిందో కూడా అర్థం కాలేదన్నారు.
'టెక్నాలజికి నేను పెద్ద అభిమానిని. నేను మొదటి నుంచి డీఆర్‌ఎస్ ఉండాలని కోరుకున్నా. కానీ ధోనీ, సచిన్ డీఆర్‌ఎస్ వ్యతిరేకించడంతో అప్‌సెట్ అయ్యా. నేను క్రికెట్ చూసిన ప్రతీ సారి అంపైర్ తప్పుడు నిర్ణయాలతో భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కోవడం గుర్తించా. అయినా మన జట్టు డీఆర్‌ఎస్‌ను ఎందుకు వ్యతిరేకించిందో అర్తం కాలేదు.
డీఆర్ఎస్ సాంకేతికత క్రికెట్‌లో ఓ పెద్ద ఆవిష్కరణ. డీఆర్ఎస్ లేకుంటే మళ్లీ నేను క్రికెట్ చూడకపోయేవాడిని. ఇది క్రికెట్‌కు ఎంతో అవసరమైనది. ప్రేక్షకుడికి అదనపు ఉత్సాహాన్ని ఇస్తుంది. తప్పుడు నిర్ణయాలను సరిచేస్తుంది. నా ప్రకారం ఈ సాంకేతికత ఆహ్వానించదగినది' అని శశిథరూర్ స్పష్టం చేశారు.
డీఆర్ఎస్ తీసుకురావాలనే ఆలోచన 2008లో భారత్-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా తొలిసారి తట్టగా... ఐసీసీ అధికారికంగా 2009లో నంబర్ 24న న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్‌తో ప్రారంభించింది. ఇక తొలుత ఈ పద్దతిని ధోనీ వ్యతిరేకించినా ఆ తర్వాత అతనే ఈ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. వికెట్ల వెనుకాల ఉంటూ అంపైర్ తప్పుడూ నిర్ణయాలను ఇట్టే పసిగట్టిన మహీ.. అనేక రివ్యూల్లో ఫలితం సాధించాడు. దీంతో డీఆర్‌ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్‌గా మార్చుకుంటూ అభిమానుల మన్ననలు అందుకున్నాడు. ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే అంపైర్ తప్పు జరిగిందని ఒప్పుకోవాల్సిందేనని చెప్పుకునేలా.. ఫలితం రాబట్టాడు.