న్యూఢిల్లీ: తాను ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తెలిపాడు. ఫిట్‌గా ఉన్నా..తమ కెప్టెన్ బౌలింగ్ ఇవ్వడం లేదని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌లో 109 పరుగులు చేస్తే.. బౌలింగ్‌లో 15 ఓవర్లు కూడా వేయలేదు. 6 ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు మాత్రమే తీసాడు.
సీజన్ మధ్యలో గాయంతో జట్టుకు దూరమైన శార్దూల్ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేదు. దాంతో అతను ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడని, ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం కష్టమేనని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ తాను ఎందుకు బౌలింగ్ చేయడం లేదో చెప్పాడు.

'మా జట్టు నిండా ఆల్‌రౌండర్లు ఉన్నారు. 11 మందిలో 8 మంది బౌలింగ్ చేస్తున్నారు. నాతో పాటు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. కెప్టెన్ నితీశ్ రాణా కూడా ప్రతీ మ్యాచ్‌లో ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నారు. సీజన్ మధ్యలో నాకు చిన్న గాయమైంది. అయితే అది ఎప్పుడో తగ్గిపోయింది.
రీఎంట్రీ తర్వాత బౌలింగ్ వేసేందుకు కావాల్సిన పూర్తి స్థాయి ఫిట్‌నెస్ కూడా సాధించాను. కానీ బౌలింగ్‌లో నా అవసరం మా కెప్టెన్‌కు రావడం లేదు.
పరిస్థితులకు తగ్గట్లు ఎవరితో బౌలింగ్ చేయించాలనేది కెప్టెన్ నిర్ణయిస్తాడు. నాకు బౌలింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే వేస్తున్నా. ఇవ్వకపోతే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
టీ20ల్లో ఆల్‌రౌండర్‌గా ఉండటం అంత తేలికైన విషయం కాదు. శరీరంపై తీవ్రమైన శ్రమ పడుతుంది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఇలా మూడింటిని ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టం. అంతేకాకుండా మైదానం మొత్తం రౌండ్స్ వేస్తూ ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాలి. ఇన్ని పనులు చేస్తే ఏవరైనా అలసిపోతారు. అందుకే ఫిట్‌నెస్ కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మిస్టరీ స్పిన్నర్లతోనే ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, సుయాశ్ శర్మలతో పాటు తాను కూడా ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తుండటంతో పేసర్లకు పెద్దగా అవకాశం దక్కడం లేదు.