
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో మన పేసర్లు చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. భారత బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 11 ఫోర్లతో 64 ) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మహమ్మద్ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆరంభంలో కొంత తడబడినా...ఒక దశలో 138/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. జో రూట్, బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే బెయిర్‌స్టోను షమీ ఔట్ చేయడంతో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. అయితే బెయిర్ స్టో వికెట్‌ను భారత్ రివ్యూ ద్వారా సాధించింది.
అయితే ఈ రివ్యూ తీసుకునే విషయంలో మైదానంలో పెద్ద డ్రామా చోటు చేసుకుందని టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. తొలి రోజు ఆట అనంతరం షమీతో కలిసి బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి రోజు తాము పై చేయి సాధించడానికి బెయిర్ స్టో వికెట్ కారణమని చెప్పాడు. అయితే ఈ వికెట్ విషయంలో రివ్యూ తీసుకునేందుకు తాను కెప్టెన్ కోహ్లీని ఒప్పించాల్సి వచ్చిందన్నాడు.
'షమీ వేసిన ఫుల్ స్ట్రైట్ డెలవరీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. అతను ఔటనే విషయం స్పష్టంగా అర్థమైంది. కానీ బంతి బ్యాట్‌కు తగిలిందా? అనే సందేహంతో అంపైర్ నాటౌటిచ్చాడు. కానీ మహమ్మద్ షమీ ఔటనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. కచ్చితంగా మిడిల్ స్టంప్‌ను హిట్ చేసేదని చెప్పాడు. ఆ సమయంలో నేను మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నా. నేను కూడా ఔటనే గట్టిగా నమ్మాను. బంతి ప్యాడ్‌ను రెండు సార్లు తాకిందని, బ్యాట్‌కు తగలేదనేది నా గట్టి నమ్మకం. కానీ ఇతర ఆటగాళ్లంతా మా నిర్ణయంతో విభేదించారు.
విరాట్ కోహ్లీ మాత్రం ఇద్దరు ఔటని కచ్చితంగా చెబితే రివ్యూ తీసుకుంటానని చెప్పాడు. నేను, షమీ బలంగా మా వాదన వినిపించడంతో కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదని తేలింది ఔటిచ్చారు. అది మాకు చాలా కీలకమైన వికెట్'అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. బెయిర్ స్టో వికెట్‌తో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. అతను ఔటైన అనంతరం 45 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ చివరి 7 వికెట్లు కోల్పోయింది.
అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (9 నాటౌట్), కేఎల్ రాహుల్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇక భారత్ తమ తుది జట్టు ఎంపికలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఒకే స్పిన్నర్‌ను జడేజాను తీసుకొని చక్కటి ఫామ్‌లో ఉన్న, ప్రాక్టీస్ కోసం కౌంటీ మ్యాచ్‌లో కూడా ఆడిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను పక్కన పెట్టింది. అతని స్థానంలో నాలుగో పేసర్‌గా, బ్యాటింగ్ కూడా చేయగల నైపుణ్యం ఉన్న శార్దుల్ ఠాకూర్‌ను ఎంచుకుంది. మరోవైపు సీనియర్ ఇషాంత్ ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో సిరాజ్‌కు చోటు దక్కింది.