
చెన్నై: న్యూజిలాండ్-ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో సంజూ శాంసన్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు శుభారంభం చేసింది. గురువారం చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ -ఏ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఏ జట్టు 40.2 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ (4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ సేన్(3/30) మూడు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. మరో ఇద్దరు బ్యాటర్లు రనౌట్‌గా వెనుదిరిగారు.
అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్-ఏ జట్టు 31.5 ఓవర్లలో మూడు వికెట్లకు 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. పృథ్వి షా(17) విఫలమైనా.. రజత్ పటీదార్(41 బంతుల్లో 7 ఫోర్లతో 45 నాటౌట్), సంజూ శాంసన్(32 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) రాణించారు. రాహుల్ త్రిపాఠి(40 బంతుల్లో 4 ఫోర్లతో 31), రుతురాజ్ గైక్వాడ్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పర్వాలేదనిపించారు. రెండో వన్డే ఆదివారం చెన్నై వేదికగానే జరగనుంది.
బెంగళూరు వేదికగా జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌ను భారత్-ఏ జట్టు 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్‌లు డ్రా కాగా.. మూడో మ్యాచ్‌లో భారత్ 113 పరుగులతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది.