
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ నిశితార్థానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఆదివారం అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే శార్దూల్ ఠాకూర్ తన పెళ్లిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు అభిమానులు మాత్రం శార్దూల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. శార్దూల్ ఠాకూర్ హిట్ వికెట్ అయ్యాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. భారత్ తరఫున ఇప్పటి వరకు 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ ఠాకూర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్-2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్... ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2021లో కూడా ఆడాడు. ఇక ఫాల్ఘర్‌కు చెందిన శార్దూల్ ఠాకూర్ మిథాలీతో సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వివాహ నేపథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు, టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని విజ్ఞప్తి మేరకే బీసీసీఐ అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది.