
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్.. తన ఆట కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడన్న విషయం తెలిసిందే. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించేవాడో... బయట కూడా ఈ 50 ఏళ్ల 'సోగ్గాడు' అంతే ఫాస్ట్‌గా ముద్దుగుమ్మలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. ఇంగ్లండ్ నటి, హాలీవుడ్ అందాల భామ ఎలిజబెత్ హర్లీతో కూడా వార్న్ ప్రేమాయణం నడిపించాడు. 2010లో వీరీ గురించి అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏడాది సహజీవన అనంతరం ఈ ఇద్దరు 2011 నిశ్చితార్థం చేసుకొని తమ ఎఫైర్‌ను అధికారింగా ప్రకటించారు. ఇక పెళ్లి ఖాయం అనుకున్న తరుణంలో 2013లో విడిపోయారు.
వార్న్ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడంతోనే హర్లీ అతన్ని ఛీ కొట్టిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఫాక్స్ స్పోర్ట్స్ 'ఏ వీక్ విత్ వార్నీ' ఆరు విభాగాల సిరీస్‌లో షేన్ వార్న్.. ఈ ఇంగ్లండ్ బ్యూటీ గురించి మాట్లాడాడు. ఆమెతో విడిపోవడం తనకు బాధ కలిగించిందని, ఇప్పటికి హర్లీని ప్రేమిస్తున్నానని తెలిపాడు. 'హార్లీతో విడిపోవడం నన్ను తీవ్రంగా బాధించింది. ఎందుకుంటే ఇప్పటికీ నేను ఆమెను ప్రేమిస్తున్నా. హార్లీ ఓ అద్బుతమైన వ్యక్తి'అని ఈ ఆసీస్ మాజీ క్రికెట్ చెప్పుకొచ్చాడు.
ఆమె మొదటి సారి ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకున్నామని, ఆరు నెలల తర్వాత తమ బంధం నిజమైందని, ఇద్దరం కలిసి జీవించవచ్చని నిర్ణయానికి వచ్చామన్నాడు. అప్పటి వరకు తన పిల్లలకు హార్లీని పరిచియం చేయాలదని ఈ ఆసీస్ దిగ్గజం తెలిపాడు. ఆమెను సీరియస్‌గా ప్రేమించానే కానీ, సరదాగా ఆమెతో తిరగలేదన్నాడు.
ఇక తన భార్య సిమోన్ క్యాలహాన్‌ను మోసం చేయడంపై పశ్చాతాపం వ్యక్తం చేశాడు. 1995లో ఆమెను పెళ్లి చేసుకున్న వార్న్.. 2005 వరకు ఆమెతో కాపురం చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. బ్రూక్ (22), జాక్సన్ (20), సమ్మర్(18). అనంతరం అమ్మాయిలపై ఉన్న వ్యామోహంతో ఆమెతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హార్లీతో బంధం తెంచుకున్న వార్నర్ అనంతరం ఇతర అమ్మాయిలతో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు.