
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచెత్తింది. అతని ఆకస్మిక మరణాన్ని క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. థాయ్‌లాండ్‌లో ఉన్న షేన్ వార్న్ గుండెపోటుతో మరణించినట్లు అతని మేనేజ్‌మెంట్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 52 ఏళ్ల షేన్ వార్న్ ఉన్నట్లుండి గుండె పోటుకు గురవ్వడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల షేన్ వార్న్ చేసిన ట్వీట్ చదివితే ఈ విషయం స్పష్టం అవుతోంది.
ఫిట్‌నెస్‌పై అతిగా శ్రద్దపెట్టడమే వార్న్ మరణానికి కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి 28న షేన్ వార్న్.. తన ఒకప్పటి ఫొటోనూ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో వార్న్ అత్యంత ఫిట్‌గా ఉన్నాడు. ఈ ట్వీట్‌కు అతి కొద్దిరోజుల్లో ఇలా తయారవుతానని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. 'ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుంది. జూలై వరకు ఒకప్పటి షేన్ వార్న్‌లా తయారవ్వడమే లక్ష్యం. హెల్తీ, ఫిట్‌నెస్, ఫీల్ గుడ్ ఫ్రైడే'అనే హ్యాష్ ట్యాగ్‌లను ఆ ట్వీట్‌కు వార్న్ జత చేశాడు.
అయితే ఫిట్‌గా తయారవ్వాలనే లక్ష్యంతో షేన్ వార్న్ డైట్ మెయింటేన్ చేయడం, అతిగా జిమ్ చేయడం అతని గుండెకు ముప్పు తెచ్చి ఉంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెటిజన్లంతా ఈ ట్వీట్‌ను గుర్తు చేస్తూ.. ఇదే వార్న్ మరణానికి కారణమై ఉంటుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది అతిగా ఎక్సర్‌సైజులు చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని, వార్న్ కూడా ఇలానే మరణించి ఉండవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు
కాగా 1992 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షేన్ వార్న్.. 2007లో వీడ్కోలు పలికాడు. 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సేవలందించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వార్న్ కంటే శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్(800) ముందున్నాడు. సచిన్-వార్న్, లారా-వార్న్ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన షేన్ వార్న్ అరంగేట్ర సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మరో టైటిల్ గెలవలేదు. 2011 వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా కొనసాగిన వార్న్.. ఆ తర్వాత మెంటార్‌గా కూడా సేవలందించాడు.