లాహోర్: చెత్త బ్యాటింగే పాకిస్థాన్ చేతిలో తమ ఘోర పరాజయానికి కారణమని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. చెత్త షాట్లతో తమ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నాడని తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షకీబ్ అల్ హసన్.. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. 'ఆరంభంలోనే మేం కీలక వికెట్లు కోల్పోయాం. పాకిస్థాన్ పేసర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. చెత్త షాట్లతో మా బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు పోవాల్సిన పిచ్ కాదు ఇది.

నాలుగు వికెట్లు కోల్పోయినా అద్భుతమైన భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నిర్మించాం. మరో 7-8 ఓవర్లపాటు మేం బ్యాటింగ్ కొనసాగించాల్సింది. నేను ఔటైన తర్వాత మరో భాగస్వామ్యం నమోదు కాలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై చెత్తగా బ్యాటింగ్ చేశాం. తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకుంటాం. పాకిస్థాన్ నెంబర్ వన్ టీమ్. వారికి ముగ్గురు వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్నారు.
వాళ్లు చెలరేగితే పాకిస్థాన్ బ్యాటర్ల పని మరింత సులవవుతోంది. బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్ విభాగంలో రాణించాం. మా పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దురదృష్టవశాత్తు బ్యాటర్లు తప్పిదం చేస్తే కానీ వికెట్లు వచ్చే పిచ్ కాదు ఇది. తదుపరి మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఎల్‌పీఎల్ ఆడిన అనుభవం నాకుంది. ఆ పిచ్‌లు చాలా నెమ్మదిగా ఉంటాయి. అవి మా జట్టుకు సరిగ్గా సరిపోతాయి. కొలంబోలో మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్(4/19), నసీమ్ షా(3/34) బంగ్లా పతనాన్ని శాసించగా.. షాహిన్ అఫ్రిది, ఫాహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 53), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(87 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది.
ఇమామ్ ఉల్ హక్(84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78), మహమ్మద్ రిజ్వాన్(79 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.