
సెంచరీతో పాటు 5 వికెట్లు:
తొలి మ్యాచ్‌కి సన్నద్ధమవుతున్న షకీబ్ అల్ హసన్ సోషల్ మీడియాలో సరదాగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఐపీఎల్‌లో మీరు బద్దలు కొట్టాలనుకుంటున్న రికార్డు ఏదైనా ఉందా అని అడగ్గా.. 'ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు 5 వికెట్లు సాధించడమే నా లక్ష్యం' అని బదులిచ్చాడు. ఇక కేకేఆర్ సహచరుడు పాట్ కమిన్స్‌ను నెట్స్‌లో ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నానని మరో అభిమానికి తెలిపాడు.

227 పరుగులు, 11 వికెట్లు:
2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో షకీబ్ అల్ హసన్ కీలకంగా వ్యవహరించాడు. 7 ఏళ్ల కిందట జరిగిన ఐపీఎల్ లీగ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారధ్యంలోని కోల్‌కతా.. కింగ్స్ పంజాబ్‌పై విజయం సాధించి రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఆ సీజన్‌లో షకీబ్.. 227 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన షకీబ్‌ను 2020లో కేకేఆర్ తిరిగి దక్కించుకున్నప్పటికీ ఆ సీజన్‌లో అతను ఆడలేకపోయాడు. దాంతో త్వరలో ప్రారంభంకానున్న 14 ఐపీఎల్ ఎడిషన్ కోసం షకీబ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

నిషేధం కారణంగా:
ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ అల్ హసన్ ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయిన విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని ఓ బుకీ సంప్రదించగా.. ఆ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగంకు సమాచారం ఇవ్వకుండా షకీబ్ దాచాడు. దాంతో అతనిపై తొలుత రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఆ తర్వాత తప్పును ఒప్పుకోవడంతో నిషేధాన్ని ఏడాదికి కుదించింది. గతేడాది ఏడాది అక్టోబరు 29తో అతనిపై ఉన్న నిషేధం ముగిసింది. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రి ఇచ్చాడు.

ఈసారి తలరాత మారేనా:
ఐపీఎల్ టోర్నీలో కేకేఆర్ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన కేకేఆర్.. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2012, 2014 సీజన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత గంభీర్ ఢిల్లీకి వెళ్ళిపోయినప్పయికీ.. ప్లేఆఫ్ వరకూ వెళ్తూ వచ్చింది. అయితే గత రెండు సీజన్లుగా ప్రదర్శన మరీ పేలవంగా మారింది. గతేడాది దినేశ్ కార్తీక్ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు కట్టబెట్టాడు. అయినప్పటికీ జట్టు తలరాత మారలేదు. మరి ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.
IPL 2021: ఐపీఎల్‌లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు అవే: పాట్ కమిన్స్


Click it and Unblock the Notifications












