టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించే సత్తా రోహిత్ సొంతమని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా.. బంగ్లాదేశ్‌తో శనివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన షకీబ్ అల్ హసన్.. రోహిత్ శర్మ సారథ్యం అద్భుతమని కొనియాడాడు. 'గత కొన్నేళ్లుగా భారత జట్టును రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. సారథిగా చాలా మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయంగా ప్రతీ ఒక్కరూ రోహిత్ శర్మను గౌరవిస్తారు. ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను అమాంతం ఒంటి చేత్తో లాగేయగల సత్తా అతనికి ఉంది.'అని షకీబ్ అల్ హసన్ అన్నాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లకు న్యూయార్క్‌లోని నాసౌవ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పిచ్‌ను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పరిశీలించారు. వారిద్దరి తొలి అభిప్రాయం 'పిచ్ చూసేందుకు సాధారణంగా ఉంది. బాగుంది'అని చెప్పారని టీమిండియా వర్గాలు తెలిపాయి.
టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే డ్రాప్ ఇన్ పిచ్‌లను వాడుతన్న సంగతి తెలిసిందే. బంగ్లాతో వార్మప్ మ్యాచ్ కూడా ఇలాంటి మీదనే జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు టీమిండియాకు ఇలా డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. ప్రధాన పోరుకు ముందు సన్నాహక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.