
గౌహతి: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2022లో తమిళనాడు స్టార్ ప్లేయర్, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షారూఖ్ ఖాన్ రెచ్చిపోయాడు. ఢిల్లీతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ హెచ్ లీగ్ మ్యాచ్‌లో భారీ శతకంతో రఫ్ఫాడించాడు. 20 ఫోర్లు, 10 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడాడు. 148 బంతుల్లో 194 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్ 6 పరుగుల వ్యవధిలోనే డబుల్ సెంచరీ చేసే బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తొలి సెంచరీనే భారీ శతకంగా మలిచిన షారుక్.. సహచర ఆటగాడు బాబా ఇంద్రజిత్ (149 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117)తో కలిసి 134 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దాంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఫలితంగా 42 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. షారుక్ ఖాన్, బాబా ఇంద్రజిత్‌తో పాటు కౌశిక్ గాంధీ (135 బంతుల్లో 8 ఫోర్లతో 55), వికెట్ కీపర్ జగదీశన్ (71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) అర్ధ శతకాలతో రాణించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బాట్యింగ్‌కు దిగిన ఢిల్లీ.. అండర్ 19 కెప్టెన్ యశ్ ధుల్ (150 బంతుల్లో 18 ఫోర్లతో 113), లలిత్ యాదవ్ (287 బంతుల్లో 17 ఫోర్లు, 10 సిక్స్‌లతో 177) శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 452 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇక షారుఖ్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్, ఆ టీమ్ ఫ్యాన్స్ తెగ సంబరిపడుతున్నారు. బెంగళూరు వేదికగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఈ తమిళనాడు హిట్టర్‌ను రూ.9 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో కూడా రూ. 5కోట్లు పెట్టి తీసుకుంది. కానీ ఆ సీజన్‌లో షారూఖ్ ఖాన్ అంతగా రాణించలేదు. దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును విజేతగా నిలిపాడు. దాంతో అందరి దృష్టి అతనిపై పడింది. బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతో ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చాయి.