
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా వైరస్ సోకింది. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి శనివారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అఫ్రిదే ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'గురువారం నుంచి నేను కొంచెం అస్వస్థతకు లోనయ్యా. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తు పాజిటీవ్ అని తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీరంతా ఇంట్లోనే భద్రంగా ఉండండి' అని అఫ్రిది ట్విట్ చేశాడు.
ఇక కరోనా సోకిన అఫ్రిదికి ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి, పాకిస్తాన్‌లోని నిరుపేదలకు అఫ్రిది తన ఫాండేషన్ ద్వారా సహాయం చేస్తున్నాడు. తన టీమ్‌తో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాడు. కాగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1 లక్షా 32 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 2600కి చేరింది.
కరోనా సోకిన పాక్ క్రికెటర్లలో షాహిద్ అఫ్రిది మూడోవాడు. ఆ జట్టు మాజీ ఓపెనర్ తఫీక్ ఉమర్, ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ జఫార్ సర్ఫరాజ్ కూడా ఈ మహమ్మారి భారిన పడ్డారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈ ఇద్దరు కోలుకున్నారు. జూన్ మొదటి వారంలోనే తఫీక్‌కు పరీక్షలు నిర్వహింగా నెగటీవ్ వచ్చింది. స్కాట్లాండ్ మాజిద్ హక్, సౌతాఫ్రికా సొలో ఎంక్వెనీలు కూడా కరోనా బారిన పడ్డారు. ఇతర క్రికెటర్లు కూడా కొవిడ్-19 బాధితులయ్యారు. క్రికెట్‌ను పునురద్దరించే క్రమంలో మాజీ ఆటగాళ్లు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.