న్యూఢిల్లీ: టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీరును పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా తప్పుబట్టాడు. ఔట్ విషయంలో హర్మన్‌ప్రీత్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన హర్మన్‌ప్రీత్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
75 శాతం మ్యాచ్ ఫీజుతో పాటు 2 మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఇప్పటికే హర్మన్ ప్రవర్తనను టీమిండియా మాజీ క్రికెటర్ల మదన్‌లాల్, డయానా ఎడుల్జీ తప్పుబట్టగా.. తాజాగా షాహిద్ అఫ్రిది కూడా ఆమె తీరుపై విమర్శలు గుప్పించాడు.'భారత జట్టు విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

అయితే మహిళా క్రికెట్‌లో ఇలాంటివి జరగడం చాలా అరుదు. ఎందుకంటే మహిళలు ఇంతగా ఆగ్రహానికి గురవ్వరు. హర్మన్‌ప్రీత్‌కు విధించిన ఈ శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగవనుకుంటున్నా. క్రికెట్‌లో దూకుడు సహజమే. అయితే నియంత్రించుకునే శక్తి కూడా ఉండాలి. హర్మన్ ప్రవర్తన హద్దులు ధాటింది. ఔట్ విషయంలో అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.
ల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించారని తీవ్ర ఆగ్రహానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్.. తన బ్యాట్‌తో వికెట్లను బలంగా కొట్టింది. అంతటితో ఆగకుండా క్రీజును వీడే సమయంలో అంపైర్‌ను బండ బూతులు తిట్టింది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లోనూ అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పించింది.
మరోసారి బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు అంపైర్లతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకొని వస్తామని వ్యంగ్యస్త్రాలు సంధించింది. ట్రోఫీ ఫొటో సెషన్ సందర్భంగా అంపైర్లను కూడా ఆహ్వానించాలని మాట్లాడి ప్రత్యర్థి ఆటగాళ్ల ఆగ్రహానికి గురైంది. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ నాలుగు డీమెరిట్ పాయింట్స్ విధించి 2 మ్యాచ్‌లు ఆడకుండా కఠిన చర్యలు తీసుకుంది.
ఐసీసీ చర్యలతో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానుంది. ఆమె గైర్హాజరీలతో టీమిండియాను స్మృతి మంధాన నడిపించనుంది.