బియ్యం ఇవ్వండి.. ఫ్రీగా ప్రచారం చేస్తా, బ్రాండ్స్‌కు అఫ్రిది బంపరాఫర్!!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అప్రిదీ వ్యాపార సంస్థలకు బంపరాఫర్ ఇచ్చాడు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటున్న విషయం తెలిసిందే. వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు.. బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు ప్రచారకర్తగా ఉచితంగా పనిచేస్తానని.. కాకపోతే తన ఫౌండేషన్‌కు బియ్యం, నిధులు ఇవ్వాలని కోరాడు. ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసి ఆయా బ్రాండ్స్‌కు విజ్ఞప్తి చేశాడు.

వాణిజ్య ప్రయోజనాలు వద్దు..
‘మీరంతా బాగానే ఉన్నారని ఆశిస్తున్నా. నేను గతంలో పనిచేసిన అన్ని బ్రాండ్లకు, వివిధ వాణిజ్య ప్రకటన సంస్థలకు ఇది నా నుంచి విభిన్నమైన విన్నపం. ఇన్నాళ్లు నా స్వంత ప్రయోజనాల కోసం నేను, మార్కెటింగ్ అవసరాలు కోసం మీరు నాతో పనిచేయించుకున్నారు. కానీ ఇప్పుడు కష్టాల్లో ఉన్న నా దేశం కోసం ఆయా బ్రాండ్లన్నిటికీ నా సేవలను అందిస్తానని తెలియజేస్తున్నా.
నాకేం వద్దు.. బియ్యం ఇస్తే చాలు..
నా స్వచ్చంద సంస్థ ద్వారా పుడ్ డ్రైవ్ చేపట్టననే విషయం మీకు తెలుసే ఉంటుంది. సాధ్యమైనంత వరకు అన్ని ప్రదేశాలను కవర్ చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం. పాకిస్థాన్ చాలా పెద్ద దేశం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాణిజ్యపరంగా మీ నుంచి నేను ఏం ఆశించడం లేదు. సోషల్ మీడియా, టీవీల ద్వారా మీకు అందుబాటులో ఉంటా. నాకెలాంటి డబ్బులు కూడా అవసరం లేదు. కానీ ప్రజలకు సాయం చేసేందుకు బియ్యాన్ని అందజేయండి'అని అఫ్రిది విజ్ఞప్తి చేశాడు.

కపిల్‌పై ఫైర్..
ఇక కరోనా విరాళాల కోసం భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహించాలన్న అక్తర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కపిల్ దేవ్‌పై అఫ్రిది ఫైర్ అయ్యారు. అక్తర్ మానవత్వంతో తనకు తోచిన సలహా ఇస్తే.. అతనిపై కపిల్ దేవ్ విరుచుకుపడటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. భారత్‌లో డబ్బుంటే.. కొందరు చెత్త కుప్పల్లోని ఆహారాన్ని ఎందుకు తింటున్నారని ప్రశ్నించాడు.
‘మానవత్వం కోసం షోయబ్ అక్తర్ సానుకూలంగా ఓ ప్రతిపాదన చేశాడు. అతని సూచనలపై బదులిస్తూ కపిల్ చేసిన వ్యాఖ్యలు నన్ను షాక్‌కు గురిచేశాయి. భారత్‌లో కొందరు చెత్త కుప్పుల్లోని ఆహారం తింటున్న వీడియోలను నేను చూశాను. కపిల్ అంటే నాకు గౌరవం ఉది. అతని నుంచి నేను చాలా పెద్దది ఆశించా.' అని అఫ్రిది మండిపడ్డాడు.
ఇక పాకిస్థాన్‌లో కరోనా రోగుల సంఖ్య 5716కు చేరగా 96 మంది మరణించారు. 1,378 మంది కోలుకున్నారు. ఆ దేశానికి చెందిన ఫస్ట్‌క్లాస్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా కాటుకు బలయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications