అన్యాయానికి వ్యతిరేకంగానే మాట్లాడుతా.. కశ్మీర్‌పై కూడా అలానే స్పందించా: అఫ్రిది

కరాచీ: తానెప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగానే మాట్లాడుతానని, ఆ నేపథ్యంలోనే కశ్మీర్ అంశంపై కూడా స్పందించానని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. కరోనా బాధితులకు సాయం అందించే క్రమంలో మూడు నెలల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో పర్యటించిన అఫ్రిది.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

విద్వేషపూరిత వ్యాఖ్యలు..
పాకిస్థాన్ సైనిక బలం మొత్తం 7 లక్షలు ఉంటే.. దానికి మించిన సంఖ్యలో భారత బలగాలను మోదీ కేవలం కశ్మీర్‌లోనే మోహరించారన్నాడు. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుందని, కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా వచ్చే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో కశ్మీర్ పేరిట ఓ జట్టును తీసుకోవాలని పీసీబీకి సూచించాడు. ఆ జట్టుకు తానే కెప్టెన్‌గా ఉంటానని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ వాఖ్యలను భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్‌తో పాటు ఇతర మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తిప్పికొట్టారు. అపట్లో అఫ్రిది కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి.

మానవత్వమే గొప్పది..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఫ్రిది ముందు ఈ కామెంట్స్ ప్రస్తావించగా.. అన్యాయంపై తన గళాన్ని వినిపించే క్రమంలోనే అలా మాట్లాడానని స్పష్టం చేశాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మానవత్వమే అత్యున్నతమైందని, అందుకే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు భయపడనని వెల్లడించాడు. ‘ప్రతి మతం మానవత్వమే అత్యుత్తమమైనదని చెబుతుంది. అన్యాయం ఎక్కడ జరుగుతున్నా స్పందిస్తాను. అది మతమైనా, వేరే దేశమైనా ఏమాత్రం వెనకడుగేయను'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

అతను పాక్ బ్యాక్‌బోన్..
ఇక పాక్ క్రికెట్ టీమ్ ఇంగ్లండ్ పర్యటనకు గురించి ప్రస్తావిస్తూ.. బాబర్ సేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. సీనియర్, యువ ఆటగాళ్లతో జట్టు చాలా బలంగా ఉందని, బాబర్ ఆజామ్ సత్తాచాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించే సత్తా అతని సొంతమని ప్రశంసించాడు. ‘పాకిస్థాన్ జట్టు వెన్నుముక బాబర్. స్థిరంగా రాణించే ఆటగాడు. రాబోయే రోజుల్లో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలడు'అని అఫ్రిది పేర్కొన్నాడు.

ఆగస్టు 5 నుంచి షురూ..
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాక్ ఆగస్టు 5 నుంచి మూడు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. కరోనా నేపథ్యంలో ఈసీబీ ఏర్పాటు చేసిన బయోబబుల్ వాతావరణంలో మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికలుగానే ఈ రెండు సిరీస్‌లు జరగనున్నాయి. ఫస్ట్ టెస్ట్ మాంచెస్టర్ వేదికగా ఆగస్టు 5న ప్రారంభం కానుండగా.. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌతాంప్టన్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌతాంప్టన్ వేదికగా జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications