
కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన ఫెవరేట్ టెస్ట్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగంగా 2006లో టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ టూర్‌లో భాగంగా జరిగిన మూడు టెస్ట్‌లో సిరీస్‌లో అఫ్రిది అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇక లాహోర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తన కెరీర్‌లో మరిచిపోలేనిదని ఈ పాక్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ క్రికెట్ గురువారం తన అధికారిక ట్విటర్‌లో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది నవ్వుతున్న ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఇది ఏ సంవత్సరమో గెస్ చేయండి? అని ప్రశ్నించింది.
దీనిపై స్పందించిన అఫ్రిది.. తన ఫేవరేట్ ఇన్నింగ్స్ కు సంబంధించిన ఫొటోనని తెలిపాడు. 'మధురానుభూతులు.. ఈ ఫొటో 2006లో లాహోర్ వేదికగా భారత్‌తో జరిగిన నా ఫేవరేట్ టెస్ట్ ఇన్నింగ్స్ తర్వాత తీసిందనుకుంటున్నా. షోయబ్ ఎప్పుడూ బౌలర్లను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టేవాడు. కానీ నాటి ఫ్లాట్ వికెట్‌పై బ్యాట్స్‌మెన్ ధాటికి పరుగులు సమర్పించుకున్న బౌలర్లు జోక్స్‌తో ఆ బాధను దిగమింగే ప్రయత్నం చేశారు.'అని అఫ్రిది బదులిచ్చాడు.
ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 679/7 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అఫ్రిది కేవలం 80 బంతుల్లోనే 128.75 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ(103) పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు ఏడు సిక్సర్లతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా ధీటుగా ఆడింది. నాటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(247 బంతుల్లో 247), రాహుల్ ద్రవిడ్ (128 నాటౌట్) 410 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇక ఫైసలాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో కూడా అఫ్రిది(128 బంతుల్లో 20 ఫోర్లు 6 సిక్సర్లతో 156) వీరవిహారం చేశాడు. భారత్‌లో రాహుల్ ద్రవిడ్(103), ధోనీ(148), ఇర్ఫాన్ పఠాన్(90) చెలరేగడంతో ఈ మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది. ఇక కరాచీ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో భారత్ 341 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై టెస్ట్ సిరీస్‌ను 0-1తో కోల్పోయింది.