పాకిస్థాన్ క్రికెట్ జట్టులో బద్ద శత్రువులుగా కొనసాగుతున్న బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిదీ మళ్లీ తలపడ్డారు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్సీ కోసం కొట్లాడుకుంటున్న ఈ ఇద్దరూ.. తాజాగా ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ సారి మాత్రం షాహిన్ షా అఫ్రిదీనే పై చేయి సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ టోర్నీ ఛాంపియన్స్ కప్‌లో బాబర్ ఆజామ్ స్టేల్లియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. లయన్స్‌కు షాహిన్ షా అఫ్రిది నాయకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా సెంచరీకి చేరువైన బాబర్ ఆజామ్‌ను షాహిన్ షా అఫ్రిదీ ఔట్ చేశాడు. బాబర్ ఆజామ్ వికెట్ తీసిన అనంతరం ప్రపంచాన్నే జయించాననే రీతిలో షాహిన్ షా అఫ్రిదీ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో ఆడిన బాబార్ ఆజామ్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 79 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగులు చేసిన బాబర్ ఆజామ్.. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్టేల్లియన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్‌తో పాటు తయ్యబ్ తాహిర్(74), మహమ్మద్ హారీస్(55), హుస్సేన్ తలత్(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. షాహిన్ అఫ్రిది, ఆమెర్ జమాల్ రెండేసి వికెట్లు తీయగా.. ఫైసల్ అక్రమ్ ఓ వికెట్ పడగొట్టాడు.
తాజాగా జరిగిన ఈ ఘటనతో పాకిస్థాన్ ఫ్యాన్స్ మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే షాహిన్ అఫ్రిదీ, బాబర్ ఆజామ్ ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నారు. కెప్టెన్సీ విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ నాకౌట్ చేరకుండానే ఇంటి బాట పట్టడంతో బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు.
అనంతరం షాహిన్ షా అఫ్రిదీ కెప్టెన్సీని స్వీకరించాడు. షాహిన్ అఫ్రిది కెప్టెన్సీలో పాకిస్థాన్ మరింత దారుణంగా విఫలమవ్వడంతో తిరిగి మళ్లీ బాబర్ ఆజామ్‌కే సారథ్య బాధ్యతలు కట్టబెట్టారు. దాంతో ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. జట్టు కూడా రెండు వర్గాలుగా విడిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ టీమ్ రాజకీయాల కారణంగానే పాకిస్థాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 0-2 క్లీన్ స్వీప్ అయ్యింది.