
సివిల్ ఇంజనీరింగ్‌ను వదిలేసి..
అందరి క్రికెటర్లలానే షెహ్‌బాజ్ అహ్మద్ సైతం తీవ్ర కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేతో ఈ ఆర్‌సీబీ స్టార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన షెహ్‌బాజ్ జట్టుకు కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు. అయితే షెహ్‌బాజ్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడ్డ కష్టం అందరికి స్పూర్తి దాయకం. హర్యానాకు చెందిన షెహ్‌బాజ్ గల్లీలోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. చదువుల్లో కూడా చాలా చురుకైన షెహ్‌బాజ్ క్రికెట్‌పై ఉన్న మక్కువతో 2015లో సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్‌లోనే వదిలేసాడు.

తండ్రిని ఎదురించి..
చదువు విషయంలో తండ్రితో గొడవపడి మరీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. కోల్‌కతాకు చేరుకొని అక్కడ టపాన్ మెమోరియల్ క్లబ్‌లో చేరి తన క్రికెట్ జర్నీని మొదలుపెట్టాడు. ఒకవేళ ఆటగాడిగా సక్సెస్ కాకపోతే మాత్రం ఇంటికి రానిచ్చేది లేదని తన తండ్రి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట. కెరీర్ ప్రారంభంలో ప్యూర్ బ్యాటర్‌గా రాణించిన షెహ్‌బాజ్ ఆ తర్వాత లెగ్ స్పిన్‌పై ఫోకస్ పెట్టి మంచి ఆల్‌రౌండర్‌గా మారాడు. 2018-19 సీజన్‌తో బెంగాల్ తరఫున రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2018-19 సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2022 సీజన్‌లో కనీస ధర రూ.20 లక్షలతో ఆర్‌సీబీలోకి వచ్చాడు. అతను సత్తా చాటడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.2.4 కోట్ల భారీ ధరకు ఆర్‌సీబీ మళ్లీ కొనుగోలు చేసింది. దీంతో షెహ్‌బాజ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఒక్క రూపాయి తీసుకోలేదు..
ఐపీఎల్ ద్వారా కోట్లు వచ్చినా.. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని షెహ్‌బాజ్ తండ్రి అహ్మద్ జాన్ తెలిపాడు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన అతను ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేను ఓ ప్రభుత్వ ఉద్యోగిని. నా సాలరీతో కుటుంబాన్ని పోషించగలను. అందుకే షెహ్‌బాజ్ సంపాదనలో నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. షెహ్‌బాజ్ మాత్రం ఓ కారు కొనుకున్నాడు. కానీ ఇప్పటికీ అతను దాన్ని సరిగ్గా నడపలేడు. మధ్యతరగతి కుటుంబాలు క్రికెట్‌ను చూడటం, ఇష్టపడటం సాధారణమే. నేను కూడా నా కాలేజ్ డేస్ వరకు క్రికెట్ ఆడాను. కానీ చదువుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.

అందరి తండ్రుల్లానే..
మా తండ్రి హెడ్ మాస్టర్, నేను ఓ ప్రభుత్వ ఉద్యోగిని, మా తమ్ముడు టీచర్, నా కూతురు డాక్టర్. షెహ్‌బాజ్ కూడా బ్రిలియంట్ స్టూడెంట్. టెన్త్‌లో 80 శాతం, ఇంటర్‌లో 88 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాలని మేం కోరుకున్నాం. చదువును పక్కనపెట్టి క్రికెట్ ఆడామని ఏ తండ్రి కూడా చెప్పడు. నేను కూడా అదే చేశా. ఓ రోజు అతను కాలేజీకి రావడం లేదని నాకు మెసేజ్ వచ్చింది. వెంటనే నేను కాలేజీకి వెళ్లగా షెహ్‌బాజ్ లేడు. క్రికెట్ మ్యాచ్‌ల కోసం అతను కాలేజీ బంక్ కొడుతున్నాడనే విషయం అర్థమైంది. అక్కడి టీచర్లు సైతం షెహ్‌బాజ్ మంచి స్టూడేంటని, చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని నాకు చెప్పారు. ఇల్లు వదిలి కోల్‌కతా వెళ్లిన షెహ్‌బాజ్ అక్కడ చాలా కష్టపడ్డాడు. మనోజ్ తివారీ సాయంతో ఈ స్థాయికి చేరుకున్నాడు'అని తండ్రి అహ్మద్ జాన్ చెప్పుకొచ్చాడు. ఇక తండ్రి కోరిక మేరకు లాక్‌డౌన్‌లో షెహ్‌బాజ్ తన సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కొసమెరుపు ఏంటంటే ఇప్పటికి షెహ్‌బాజ్ తండ్రి అతన్ని నమ్మడం లేదు.


Click it and Unblock the Notifications












