Womens T20 World Cup 2026: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా మూడో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులే చేసింది. జుయారియా ఫెర్డోస్(31 బంతుల్లో 5 ఫోర్లతో 33), నిగర్ సుల్తానా(27 బంతుల్లో 4 ఫోర్లతో 32), సోభనా మోస్ట్రే(26 బంతుల్లో 2 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్(3/28) మూడు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, నందని శర్మ తలో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీచరణి(2/21) రెండు వికెట్లతో సత్తా చాటింది.

అనంతరం భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. షెఫాలీ వర్మ(34 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. యస్తికా భాటియా(18 బంతుల్లో 3 ఫోర్లతో 23), జెమీమా రోడ్రిగ్స్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) విలువైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితూ మోనీ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తెర్, రాబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసారు. నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో టీమిండియా గ్రూప్-1లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. రెండో ప్లేస్ కోసం భారత్, సౌతాఫ్రికా మధ్య పోటీ నెలకొంది. సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ వంటి పసికూనలతో ఆడనుండగా.. భారత్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాపై మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. కానీ ఓడితే మాత్రం సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ రన్ రేట్ సౌతాఫ్రికా కంటే మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాపై విజయం సాధించి నాకౌట్ చేరితేనే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

