PAK vs NED: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: నెదర్లాండ్స్ కెప్టెన్
చిన్న చిన్న తప్పిదాలే తమ ఓటమిని శాసించాయని నెదర్లండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. బ్యాటింగ్‌లో అదనపు పరుగులు చేసినా.. బౌలింగ్‌లో తప్పిదాలు చేయకపోయినా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
148 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఓటమి దిశగా సాగింది. కానీ ఫహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్)అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ను గట్టెక్కించాడు. 19వ ఓవర్ ముందు వరకు విజయం దిశగా సాగిన నెదర్లండ్స్ చివరకు ఓటమికి తల వంచింది. వాన్ బీక్ వేసిన ఈ ఓవర్‌లో ఫహీమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను లాంగాఫ్‌లో నెదర్లాండ్ ఫీల్డర్ వదిలేసాడు. ఈ అవకాశంతో చెలరేగిన ఫహీమ్ రెండు మూడు సిక్స్‌లు, ఓ బౌండరీ సాయంతో 24 పరుగులు పిండుకొని పాకిస్థాన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

అనవసర తప్పిదాలతో..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన నెదర్లండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అనవసర తప్పిదాలతోనే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని తెలిపాడు. 'మేం అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. ఈ మ్యాచ్‌లో ఓడినా.. గెలుపు కోసం పోరాడిన మా ఆటగాళ్లను అభినందించాలి. కొన్ని చిన్న చిన్న తప్పులు మమ్మల్ని దెబ్బతీశాయి. 160 పరుగులు చేసి ఉంటే మాకు మంచి అవకాశం ఉండేదని భావించాం.
మేం ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉండేది. మా బౌలర్ల అద్భుత ప్రదర్శనలు మమ్మల్ని మ్యాచ్‌లో నిలబెట్టాయి. ఇది మంచి వికెట్, పాకిస్థాన్ ఒక దశలో బంతికి ఒక పరుగు చేసే స్థితికి చేరుకుంది. కానీ అప్పుడు మేము ఒక మెయిడెన్ ఓవర్ వేయడంతో మా వాళ్ళు మళ్ళీ ఊపు అందుకున్నారు.'అని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పుకొచ్చాడు.
ఇది మాకు అలవాటే: షహీమ్
పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫహీమ్ అష్రఫ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఉత్కంఠ మ్యాచ్‌లు తమకు అలవాటేనని తెలిపాడు. 'గతేడాది కాలంగా మేము ఇదే తరహా క్రికెట్ ఆడుతున్నాం. హృదయ స్పందనలు పెరగడం, తగ్గడం మాకు అలవాటే. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం.
వికెట్లు కాపాడుకోవడం గురించి నేను, షాహీన్ మాట్లాడుకున్నాం. ఏదో ఒక ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించగలమని మాకు తెలుసు. బంతి గాలిలో ఉన్నప్పుడు, అది ఎక్కడ పడుతుందా? అని ఆందోళనగా ఉంటుంది. వీలైనంత త్వరగా మ్యాచ్‌లను ముగించాలన్నదే మా ప్రయత్నం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిగ్రహం కోల్పోకుండా ఉండటం ముఖ్యం.'అని ఫహీమ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications