స్కాట్లాండ్ పేసర్ చార్లీ కాసెల్ చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ లీగ్ 2లో భాగంగా ఓమన్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చార్లీ కాసెల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతను.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.
5.4 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా రికార్డును చార్లీ కాసెల్ అధిగమించాడు.

2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన రబడా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే ఇదే అత్యుత్తమ రికార్డుగా ఉండగా.. తాజాగా చార్లీ కాసెల్ అధిగమించాడు. అంతేకాకుండా అరంగేట్రంలోనే తొలి రెండు బంతుల్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గానూ చార్లీ కాసెల్ చరిత్రకెక్కాడు.
తాను వేసిన ఫస్ట్ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లోనే ఓమన్ బ్యాటర్లు జీషన్, అయాన్ పెవిలియన్ చేరారు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి ఓమన్ చార్లీ కాసెల్ ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్కాట్లాండ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.