భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ భారత ద్వయాన్ని ఫైనల్ ఫోబియా వెంటాడుతోంది. ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో ఓడిన సాత్విక్-చిరాగ్ జోడీ.. తాజాగా చైనా మాస్టర్స్ టోర్నీలోనూ టైటిల్ ఫైట్‌లోనే వెనుదిరిగింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత ద్వయం అడుగు దూరంలో టైటిల్‌ను కోల్పోయింది.
ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 19-21, 15-21 తేడాతో సౌత్ కొరియా ద్వయం సంగ్ జే-కిమ్ వాన్ హో చేతిలో ఓటమిపాలైంది. 41 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో కొరియా ద్వయం భారత జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో భారత్ ద్వయం పోరాడినప్పటికీ.. కొరియా జోడీ అవకాశం ఇవ్వలేదు. ఏకపక్షంగా సాగిన రెండో గేమ్‌లో కొరియా జోడీ ధాటికి భారత్ ద్వయం కోలుకోలేకపోయింది.

సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-17, 21-14 తేడాతో ఆరోన్ చియా-సో వీయ్(మలేసియా) జోడీని ఓడించింది. తమకంటే మెరుగైన ర్యాంకర్ జోడీని భారత ద్వయం ఓడించడంతో టైటిల్ కూడా గెలుస్తుందని అంతా భావించారు. కానీ భారత జోడీకి ఫైనల్లో నిరాశ తప్పలేదు.
గతేడాది మేలో జరిగిన థాయిలాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ గెలవలేదు. ఇటీవల జరిగిన హాంగ్ కాంగ్ ఓపెన్ ఫైనల్లో చైనా ద్వయం చేతిలో ఓటమిపాలైంది. ఆగస్ట్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ద్వయం కాంస్య పతకం గెలిచింది. నిలకడగా రాణిస్తున్నా.. ఈ ఏడాది టైటిల్ నిరీక్షణ మాత్రం తప్పడం లేదు. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోనే భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వెనుదిరిగిన విషయం తెలిసిందే.