ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్.. ఆదివారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 25 బంతులాడి 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు.
సరిగ్గా మినీ వేలానికి రెండు రోజుల ముందే సర్ఫరాజ్ ఖాన్ తన హిట్టింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. గతేడాది మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్.. తాజా ఇన్నింగ్స్‌తో ఈసారి అమ్ముడుపోయే అవకాశాలను మెరుగుపర్చుకున్నాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే.

సర్ఫరాజ్ ఖాన్‌కు తోడుగా యశస్వి జైస్వాల్(50 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్(42 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), నిషాంత్ సింధు(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే 6 వికెట్లకు 238 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఖాన్ రూ.75 లక్షల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్నాడు. అతి తక్కువ పర్స్ విలువ కలిగిన ముంబై ఇండియన్స్.. సర్ఫరాజ్ ఖాన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 13 కిలోల బరువు తగ్గి సన్నగా మారిపోయాడు.