ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. గోవాతో బుధవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. 9 ఫోర్లు, 14 సిక్సర్లతో వీర విహారం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసాడు. అతని ధాటికి గోవా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్ ఖాన్.. ఆరంభం నుంచే దూకుడు కనబర్చాడు. 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. సిక్సర్‌తోనే 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 209.33 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల విధ్వంసం సృష్టించాడు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌ను కూడా సర్ఫరాజ్ ఖాన్ చీల్చి చెండాడాడు. సర్ఫరాజ్ ధాటికి 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ 9.75 ఎకానమీతో 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఇతర బౌలర్లు కూడా ధారళంగా పరుగులిచ్చారు.

సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 444 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు అతని తమ్ము ముషీర్ ఖాన్(66 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), హార్దిక్ తోమోర్(28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. యశస్వి జైస్వాల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
గోవా బౌలర్లలో వాసుకి కౌషిక్(2/60), లలిత్ యాదవ్(2/93) రెండేసి వికెట్లు తీయగా.. దర్షన్ మిసల్(3/98) మూడు వికెట్లు పడగొట్టాడు. దీప్ రాజ్(1/57) ఒక వికెట్ దక్కగా.. అర్జున్ టెండూల్కర్(0/78), శుభమ్ తరి(0/52) ధారళంగా పరుగులిచ్చుకున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో చివర్లో దయతలచి మరి అతన్ని తీసుకుంది. సర్ఫరాజ్‌ను కొనుగోలు చేయడంపై అప్పట్లో సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎస్‌కే ఫ్యాన్స్ కొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కానీ తాజా ప్రదర్శనతో అతను ఎంతటి విలువైన ఆటగాడో వారికి తెలిసొచ్చింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు.