ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభానికి ముందు సంజూ శాంసన్ దుమ్మురేపుతున్నాడు. ఆదివారం భారీ శతకంతో చెలరేగిన సంజూ శాంసన్.. తాజాగా విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025లో కొచ్చి బ్లూ టైగర్స్‌కు సారథ్యం వహిస్తున్న సంజూ శాంసన్ నిలకడగా ఆడుతూ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు.
మంగళవారం తిస్సూర్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్.. 46 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 89 పరుగుల చేశాడు. మరో సెంచరీ దిశగా సాగిన సంజూ శాంసన్‌ను అజినాస్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మిగతా బ్యాటర్లు నిరాశపర్చడంతో కొచ్చి బ్లూ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది.
కొల్లమ్ సెయిలర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సంజూ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ 42 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని బౌలర్లను ఊచకోత కోసాడు. ఓపెనర్‌గా తన బిగ్ హిట్టింగ్ సామర్థ్యాన్ని చాటి చెప్పాడు. శుభ్‌మన్ గిల్ కంటే తాను ఎంతో మెరుగైన ఓపెనర్‌నని అల్టిమేటం జారీ చేశాడు.

ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కింది. కానీ అతన్ని తుది జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. మీడియా సమావేశంలో వెల్లడించాడు. సంజూ శాంసన్ జట్టులో ఉన్నప్పటికీ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఆడుతాడని హింట్ ఇచ్చాడు. గిల్, యశస్వి జైస్వాల్ టీ20 ఫార్మాట్‌కు అందుబాటులో లేకపోవడంతోనే సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడాడని, అది అతని పర్మినెంట్ ప్లేస్ కాదని అగార్కర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఓపెనర్‌గా సత్తా చాటాడని, అతని చేరికతో జట్టుకు బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుందన్నాడు.
అయితే భారత్ తరఫున గత 10 ఇన్నింగ్స్‌ల్లో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేసి మూడు శతకాలు సాధించాడు. కానీ గిల్ రాకతో అతన్ని ఓపెనింగ్ ఆడిస్తారా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ గిల్ ఓపెనింగ్ చేస్తే సంజూ శాంసన్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లోయరార్డర్‌లో సంజూ కంటే వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ బాగా సెట్ అవుతాడు. మరీ హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏం చేస్తాడో చూడాలి.