టీ20 క్రికెట్‌లో వరుస సెంచరీలతో జోరు మీదున్న సంజూ శాంసన్‌కు టెస్ట్‌ల్లో అవకాశమిస్తే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో చెలరేగుతాడని అతని చిన్ననాటి కోచ్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్ అన్నాడు. కేరళ రంజీ టీమ్‌లో కూడా అతనికి ఓపెనర్‌గా అవకాశమివ్వాలని సూచించాడు.
సంజూ శాంసన్ ప్రతీ రోజు పరుగులు చేయకున్నా సెహ్వాగ్ తరహాలో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతాడని చెప్పాడు. 'రెడ్ బాల్ క్రికెట్‌లో కేరళ తరఫున సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడాలి. టెస్ట్ ఫార్మాట్‌లో సంజూ శాంసన్ ఒక్కసారి కుదురుకుంటే అతన్ని ఎవరూ ఆపలేరు. ప్రస్తుతం సంజూ 2.O వర్షన్‌లో ఆడుతున్నాడు.

9 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినా.. అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు సరైన పాత్ర ఇచ్చి అవకాశాలు ఇవ్వడంతో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా పరుగుల మోత మోగిస్తున్నాడు. అతని బ్యాటింగ్ ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను.
అతను చాలా కష్టాలను దాటుకొని వచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో సంజూ ముఖ్యమైన ఆటగాడనే విషయాన్ని జనాలు గ్రహించారు. సంజూ శాంసన్ నుంచి ప్రతీసారి 70-80 పరుగులు ఆశించవద్దు. కానీ అతను పరుగులు చేసినప్పుడు జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తోంది.'అని బిజు జార్జ్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న సంజూ శాంసన్.. ఆ జట్టుతో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో తన ఫామ్‌ను కొనసాగించాడు. తొలి టీ20 విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20లో తొలి సెంచరీ సాధించిన సంజూ.. ఆ వెంటనే సఫారీ గడ్డపై శతకంతో చెలరేగాడు. దాంతో అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో మాత్రం డకౌటయ్యాడు.
నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సంజూ శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా అతను అందిపుచ్చుకున్నాడు. సంజూ విధ్వంసకర బ్యాటింగ్ పట్ల అతని అభిమానులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఈ అవకాశం కోసం సంజూ శాంసన్ నిరీక్షించాడు. కోహ్లీ, రోహిత్, జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకున్నాడు.