
ముంబై: బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. బ్యాటింగ్ వైఫల్యం దెబ్బతీసిందన్నాడు. తాము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. మరో 20 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. టాస్ కూడా కీలక పాత్ర పోషించిందని, తదుపరి మ్యాచ్‌ల్లోనైనా గెలవాల్సిన అవసరం ఉందన్నాడు.
'వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. కేకేఆర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసింది. కానీ మేం కాస్త వేగంగా బ్యాటింగ్ చేయాల్సింది. ముఖ్యంగా చివర్లో మరిన్న బౌండరీలు రాబట్టి సరైన ఫినిషింగ్ అందించాల్సింది. మేం 15-20 పరుగులు తక్కువగా చేశాం. అయినా బంతితో అద్భుత పోరాటం కనబర్చాం. ఇంకొన్ని పరుగులుంటే బాగుండేది. వ్యక్తిగతంగా నాతో పాటు మేం కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. టాస్ కీలకమైంది. అంతేకాకుండా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. నేను కూడా ధాటిగా ఆడలేకపోయాను. భాగస్వామ్యం కోసం నిదానంగా ఆడి సరైన టైమ్‌లో ఔటయ్యాను. భారీ షాట్లు ఆడకుండా కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం మా ప్రణాళికలకు తగ్గట్లు షాట్స్ ఆడలేకపోయాం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. సంజూ శాంసన్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రియాన్ పరాగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19), హెట్‌మైర్(13 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివం మావి, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్), రింకూ సింగ్ (23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, కుల్దీప్ సేన్ తలో వికెట్ తీసారు.