ఐపీఎల్ 2026 సీజన్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్ తన ప్రపంచమని, ఆ జట్టుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని సంజూ శాంసన్ ఫ్రాంచైజీని కోరాడని వార్తలు వచ్చాయి.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆఫర్ రావడంతో సంజూ శాంసన్ ఆ జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంజూ ట్రేడింగ్ డీల్‌పై ఇరు జట్లు చర్చలు జరుపుతున్నాయని, సంజూ స్థానంలో ఇద్దరి ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ డిమాండ్ చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ రాయల్స్ గురించి సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్‌గా తనను ప్రపంచానికి పరిచయం చేసిందే రాజస్థాన్ రాయల్స్ అని పేర్కొన్నాడు.

'రాజస్థాన్ రాయల్స్ నా ప్రపంచం. కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన కుర్రాడు తన ప్రతిభ చాటాలనుకున్నాడు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ సర్, రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బాదాలే ఆ కుర్రాడికి వేదికను ఇచ్చి ఈ ప్రపంచానికి నువ్వేంటో చాటి చెప్పు అన్నారు. నాకు ఎప్పుడూ రాజస్థాన్ రాయల్స్ అండగా నిలిచింది.
ఆ జట్టుతో నా ప్రయాణం ఎప్పుడూ గొప్పగా సాగింది. ఆ ఫ్రాంచైజీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను'అని సంజూ శాంసన్ తెలిపాడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై, ఆ జట్టులో కొనసాగే విషయంపై సంజూ శాంసన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టే.. సంజూ శాంసన్‌ను వదులుకుంటుందా? అనే చర్చ మొదలైంది.