టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తనను తప్పించారని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. ఫైనల్‌కు ముందు రోజు తుది జట్టులో ఉన్నావని, మ్యాచ్‌కు సిద్దం కావాలని చెప్పారని, కానీ టాస్ ముందు ఎలాంటి మార్పులు చేయడం లేదన్నారని గుర్తు చేసుకున్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన ఈ మెగా ఫైనల్లో టీమిండియా సంచలన విజయంతో 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ జట్టులో భాగంగా ఉన్న సంజూ శాంసన్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతను డకౌటవ్వడంతో బెంచ్‌కే పరిమితం చేశారు.

టాస్‌కు ముందు తప్పించారు..
తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చివరి నిమిషంలో తుది జట్టు నుంచి తప్పించినందుకు రోహిత్ శర్మ క్షమాపణలు చెప్పాడని, తప్పించడానికి గల కారణాలను వివరించేందుకు ప్రయత్నించాడని సంజూ శాంసన్ గుర్తు చేసుకున్నాడు.
'టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ముందుగా నాకు ఆడే అవకాశం దక్కింది. ఫైనల్‌కు ముందు రోజు తుది జట్టులో ఉన్నావని, మ్యాచ్‌కు సిద్దం కావాలని చెప్పారు. దాంతో నేను నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాను. కానీ టాస్‌కు ముందు జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని చెప్పారు. దాంతో నేను కాస్త నిరాశకు గురయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితులు నాకు కొత్త కాదు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాను.
రోహిత్ వచ్చి మాట్లాడాడు..
వాస్తవానికి చివరి నిమిషం దాకా ఆడుతాననే నమ్మకం కూడా నాకు లేదు. మ్యాచ్‌కు ముందు వామప్ సమయంలో రోహిత్ శర్మ వచ్చి నన్ను తప్పించడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశాడు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అని అడిగాడు. నేను.. రోహిత్ భాయ్‌కి ఒక్కటే చెప్పాను.
మ్యాచ్ గెలుద్దాం.. ఆ తర్వాత మాట్లాడుకుందాం. నాగురించి ఆలోచించకుండా.. మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టమన్నాను. ఒక్క నిమిషం తర్వాత నీ మైండ్‌సెట్ నన్ను వెంటాడుతున్నావ్.. నీ ఆలోచనల్లో ఏదో ఉందనిపిస్తోంది. నువ్వు సంతోషంగా లేవనే విషయం అర్థమవుతుందని రోహిత్ భాయ్ అన్నాడు. ఓ క్రికెటర్‌గా టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడాలనే కోరిక ఉంది.

రోహిత్.. నువ్వో గొప్ప సారథి..
చిన్నప్పటి నుంచి భారత్ తరఫున ఆడి మ్యాచ్‌లు గెలిపించాలని కలలు కన్నాను. అయినా నువ్వు ఇలా నాకు వివరించడం సంతోషంగా ఉంది. నీలాంటి సారథితో ప్రపంచకప్ ఫైనల్ ఆడే అవకాశం దక్కకపోవడం బాధపెట్టే విషయమే. ప్రపంచకప్ ఫైనల్లో మార్పులు లేకుండా బరిలోకి దిగడం ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. టాస్‌కు 10 నిమిషాల ముందు మ్యాచ్ ఆడని ఓ ఆటగాడితో మాట్లాడుతున్నావ్ అంటేనే నువ్వో గొప్ప లీడర్‌వు అని బదులిచ్చాను.
రోహిత్ శర్మ స్థానంలో నేనున్నా అలా మాట్లాడకపోయేవాడిని. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుదామనుకునేవాడిని. ఆ సమయంలోనే రోహిత్.. నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ స్థానంలో బరిలోకి దిగిన పంత్ డకౌటయ్యాడు.
సూర్య స్టన్నింగ్ క్యాచ్‌తో..
సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు హార్దిక్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‌లో పంత్ విఫలమైనా.. వేగంగా సాగుతున్న మ్యాచ్ తన టెక్నిక్‌తో ఆపి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మోకాలి గాయం అంటూ డ్రామా ఆడి మ్యాచ్‌ను ఆపేసాడు. మూమెంటమ్ దెబ్బతిని సఫారీ ఆటగాళ్లను ఔటయ్యారు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్ భారీ శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను కేరళ తరఫున రంజీ క్రికెట్ ఆడుతున్నాడు.