
ముంబై: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు తనను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలు అభినందించారని సంజూ శాంసన్ తెలిపాడు. ఇక గత సీజన్‌లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆ టీమ్ ఫ్రాంచైజీ.. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై వేటు వేసి సంజూశాంసన్‌ను తమ నూతన సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూశాంసన్.. విరాట్, రోహిత్, ధోనీ తనకు అభినందనలు తెలిపిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.
'కంగ్రాట్స్ శాంసన్.. కొత్త బాధ్యతతో ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్నావు.. ఆల్ ది బెస్ట్'అని ముగ్గురు సారథులు అభినందిస్తూ పర్సనల్‌గా మేసేజ్ చేశారని శాంసన్ తెలిపాడు. కొన్నేళ్లుగా ఆడుతున్న జట్టుకు సారథి కావడం గర్వంగా ఉందని సంజూ సంతోషం వ్యక్తం చేశాడు. 'రాయల్స్ జట్టు నాణమైన ఆటగాళ్లతో పాటు అద్భుతమైన సపోర్ట్ స్టాఫ్‌ను కలిగి ఉంది.
కొన్నేళ్లుగా ఈ జట్టుకు ఆడుతుండటంతో వారందరికి నేను బాగా తెలుసు. మేమంతా ఓ కుటుంబం. కాబట్టి నా చుట్టున్నవారితో నేను సౌకర్యంగా ఉండగలుగుతా. నా టీనేజ్ నుంచి (2013) రాయల్స్‌కు ఆడుతున్నాను. ఇన్నాళ్లు ఆ జట్టుకు ఆడి ఇప్పుడు కెప్టెన్ కావడం గర్వంగా ఉంది.'అని శాంసన్ చెప్పుకొచ్చాడు.
2013 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న సంజు శాంసన్.. ఆ జట్టుపై 2016-17లో నిషేధం పడటంతో.. ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌ని పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 12న ముంబైలో ఆడనుంది.