
న్యూఢిల్లీ: భారత జట్టులో చోటివ్వకుండా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీసీసీఐపై అభిమానులు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన సంజూ శాంసన్.. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు కేవలం 27 మ్యాచ్‌లే ఆడాడు. ఇందులో కూడా ద్వితీయ శ్రేణి జట్టు తరఫున ఈ ఏడాది ఆడినవే ఎక్కువగా ఉన్నాయి. భారత జట్టు ఎంపిక చేసిన ప్రతీసారి సంజూ శాంసన్ పేరు వార్తల్లో వినబడుతోంది. సంజూకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని అతని అభిమానులు నిలదీస్తూ ఉంటారు.
అయితే సంజూ శాంసన్‌కు జరుగుతున్న అన్యాయానికి చలించిన ఐర్లాండ్ క్రికెట్.. ఈ కేరళ ఆటగాడికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఐర్లాండ్ క్రికెట్ అధ్యక్షుడు డేవిడ్ గ్రిఫిన్.. సంజూ శాంసన్‌ను కోరాడట. అంతేకాదు..తనను ఐర్లాండ్ జాతీయ జట్టు కెప్టెన్‌గా కూడా చేస్తామని ప్రతిపాదించినట్టు సంజూ శాంసన్ ఓ వెబ్‌సైట్‌కు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఐర్లాండ్ క్రికెట్ అధ్యక్షుడే ఈ ఆఫర్ ఇచ్చినా.. సంజూ శాంసన్ సున్నితంగా తిరస్కరించాడట. 'మీ ప్రతిపాదనకు థ్యాంక్స్. భారత్‌కు ఆడాలన్న లక్ష్యంతోనే నేను క్రికెట్ కెరీర్ ప్రారంభించా. మా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. నాకు మరే జట్టుకూ ప్రాతినిధ్యం వహించాలన్న ఆలోచనే లేదు. టీమిండియా తరపున నాకు తగినన్ని అవకాశాలు లభించి ఉండకపోవచ్చు. కానీ మరింతగా శ్రమించి జట్టులో చోటు సంపాదిస్తా'అని శాంసన్ బదులిచ్చాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సంజూ అభిమానులు మాత్రం ఈ ఆఫర్‌ను స్వీకరించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
భారత క్రికెట్‌లో దక్షిణాది ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వరని, బీసీసీఐ పెద్దల మద్దతు లేకుండా జట్టులో కొనసాగడం కష్టమని కామెంట్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఐపీఎల్‌లో సత్తా చాటినా సంజూకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలబెట్టిన హార్దిక్ పాండ్యాను టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ చేయాలనుకుంటున్న బీసీసీఐ.. రన్నరప్‌గా నిలబెట్టిన సంజూ శాంసన్ ఎందుకు కనబడటం లేదో తమకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. వరుసగా విఫలమవుతున్నా.. రిషభ్ పంత్‌కు అవకాశాలిస్తున్న బీసీసీఐ.. సంజూను ఆడించకపోవడం దారుణమంటున్నారు.