టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శభాష్ సూరీడు.. మాట నిలబెట్టుకున్నావ్ అని కొనియాడుతున్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆడించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో ఈ టోర్నీలో సంజూ శాంసన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
ఏడాది తర్వాత వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో తుది జట్టులో అతన్ని తప్పక ఆడిస్తారని, ఓపెనర్ బరిలోకి దిగుతాడనే అభిప్రాయం వ్యక్తమైంది. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 3 శతకాలతో సత్తా చా టాడు. అయితే గిల్ రాకతో సంజూ స్థానంపై సందేహాలు మొదలయ్యాయి. ఫస్ట్ డౌన్‌లో ఆడుతాడా? అంటే ఆ స్థానాన్ని తిలక్ వర్మ భర్తీ చేశాడు.
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ రూపంలో సంజూకు పోటీ ఎదురైంది. జితేష్ శర్మకు ఫినిషర్‌గా మెరుగైన రికార్డ్ ఉండటం, ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో అతను కీలక పాత్ర పోషించడంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమవుతాడనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందు ప్రస్తావించగా.. అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ గురించి చింతించాల్సిన అవసరం లేదని, అతన్ని తాము బాగా చూసుకుంటామని, తుది జట్టు విషయంలో సరైన నిర్ణయమే తీసుకుంటామని తెలిపాడు. సంజూ తుది జట్టులో ఉంటాడనే హింట్ ఇచ్చాడు. చెప్పినట్లుగానే తొలి మ్యాచ్‌కు సంజూ శాంసన్‌ను తీసుకొని మాట నిలబెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సూర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే సంజూను ఓపెనర్‌గా కొనసాగించాలని, శుభ్‌మన్ గిల్ కోసం అతనికి అన్యాయం చేయవద్దని హితవు పలుకుతున్నారు. రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యారు.
భారత్ తుది జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.