హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు తన శతకాన్ని అంకితమిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఓపెనర్ సంజూ శాంసన్ తెలిపాడు. అందుకే సెంచరీ తర్వాత సెల్యూట్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నానని చెప్పాడు. వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా.. హెడ్ కోచ్‌తో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ తనపై నమ్మకం ఉంచిందని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ సెంచరీతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

ఈ సందర్భంగా టీమ్‌మేనేజ్‌మెంట్ సహకారంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. 'ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. నాపై మేనేజ్‌మెంట్ ఉంచిన నమ్మకం నాలో కసిని పెంచింది. అదృష్టవశాత్తూ ఈరోజు అంతా అనుకున్నట్లు సాగింది. ఇక్కడ ఉన్న వ్యక్తులు చాలా మంచి వారు. అందుకే ఇది వేరే ఫ్రాంచైజీ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు.

వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు మా మీటింగ్ కేవలం 50 సెకన్లు మాత్రమే జరిగింది. అంతగా మాపై నమ్మకం ఉంచారు. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను.
మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కూడా మాట్లాడిన సంజూ.. పిచ్ క్యూరేటర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా రవిశాస్త్రి తనకు లక్కీ ఛార్మ్ అని, తన ప్రతీ మ్యాచ్‌కు రావాలని కోరుతూ నవ్వులు పూయించాడు. ఎప్పుడూ సెంచరీ చేసినా సైలెంట్‌గా ఉండే సంజూ ఈ రోజు మాత్రం హుషారు బ్యాట్ పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. డగౌట్ వైపు సైగలు చేస్తూ సెల్యూట్ చేశాడు. తమ కోచ్ కోసమే అలా చేశానని సంజూ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ఆయుష్ మాత్రే(36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో189 పరుగులకు ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. పాతుమ్ నిస్సంక(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) దూకుడుగా ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, గుర్జప్‌నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.
