ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతాడా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ఆ జట్టు తమ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మతో పాటు అతని అభిమానులు, ఇతర ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోహిత్ శర్మ సైతం ముంబై ఇండియన్స్ పేరు ప్రస్తావించకుండా.. ఆ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వీడుతాడనే వార్తల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు అతన్ని తీసుకునేందుకు సిద్దమవుతున్నాయని, రూ. 50 కోట్ల పర్స్‌మనీని పక్కకు పెట్టాయని కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఇప్పటికే పంజాబ్ కింగ్స్ తరఫున సంజయ్ బంగర్ స్పందించాడు.
రోహిత్ శర్మ వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసే ప్రయత్నం పంజాబ్ కింగ్స్ చేస్తుందని, అయితే రూ. 50 కోట్లు ఖర్చు చేస్తుందా? అనేది చెప్పలేనన్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాను ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన ఘాటుగా బదులిచ్చాడు. ఒక్క ఆటగాడికే రూ. 50 కోట్లు ఖర్చు చేస్తే.. మిగతా 22 మంది ఆటగాళ్లను ఎలా తీసుకోవాలని ప్రశ్నించాడు.
ఇలాంటి రూమర్స్‌ను ఎలా క్రియేట్ చేస్తారని మండిపడ్డారు. 'రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడని ఎవరికైనా తెలుసా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. రోహిత్ శర్మను ముంబై రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అతను వేలంలోకి వచ్చినా.. ఒక్క ప్లేయర్ కోసం పర్స్‌లోని 50 శాతం వెచ్చిస్తారా? మరి మిగతా ప్లేయర్లను ఎలా కొనుగోలు చేయాలి? కనీసం 22 మందిని ఎలా మేనేజ్ చేయాలి?
వేలంలోకి వస్తే రోహిత్ శర్మను ఏ జట్టు అయినా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. టాప్ ప్లేయర్లను కోరుకోవడం సహజమే. జట్టులో అత్యుత్తమ కెప్టెన్, అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలనుకుంటాం. అందుబాటులో ఉన్న వాటిల్లో నుంచి మెరుగైనవి ఎంచుకుంటాం. నాలాగే మిగతా ఫ్రాంచైజీలు ఆలోచిస్తాయి. అలాగని ప్రతీ ఒక్కరినీ తీసుకోవడమూ కుదరదు.'అని వెల్లడించారు.