టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో జడేజా.. టీమిండియా భారీ విజయానికి బాటలు వేసాడని కొనియాడాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
81 పరుగులతో క్రీజులో ఉన్న జడేజా.. భారత్‌కు భారీ ఆధిక్యం అందించే దిశగా సాగుతున్నాడు. ఇప్పటికే భారత్ ఆధిక్యం 175 పరుగులకు చేరగా.. చేతిలో మరో 3 వికెట్లు ఉన్నాయి. అయితే టీమిండియా బ్యాటింగ్‌కు విశ్లేషించిన మంజ్రేకర్.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తవుతుందని జోస్యం చెప్పాడు.

జడేజా కారణంగానే ఇంగ్లండ్ ఘోర పరాజయం ఎదుర్కోనుందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ కూడా తప్పిదాలు చేశాడని, తుది జట్టు ఎంపిక నుంచి బౌలింగ్ మార్పుల వరకు అతను తడబడ్డాడని చెప్పాడు. 'రవీంద్ర జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలవ్వనుంది.
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓవర్ అటాకింగ్ గేమ్‌తో శతకాలు చేజార్చుకున్నారు. అయితే ఆ శతకాలు ముఖ్యమని నేను భావించడం లేదు. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ చేసిన తప్పిదాలు భారత్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా జోరూట్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకురావడం ఆ జట్టు కొంపముంచింది. మరీ ముఖ్యంగా లెఫ్టాండర్ అయిన యశస్వి జైస్వాల్‌ను కట్టడి చేసేందుకు జోరూట్‌తో ముందుగానే బౌలింగ్ చేయాల్సింది.
అలాగే ఇంగ్లండ్ తమ తుది జట్టులో జేమ్స్ అండర్సన్, మార్క్‌వుడ్‌లను ఆడించాల్సింది. ఈ ఇద్దరూ క్వాలిటీ బౌలర్లు. ఎక్కువ స్పిన్నర్లతో బరిలోకి దిగడం వారికి నష్టం చేసింది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 110 ఓవర్లలో 7 వికెట్లకు 421 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(74 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), కేఎల్ రాహుల్(123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86), రవీంద్ర జడేజా(155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
తెలుగు తేజం కేఎస్ భరత్(81 బంతుల్లో 3 ఫోర్లతో 41) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లీ, జోరూట్ రెండేసి వికెట్లు తీయగా.. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 175 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.