స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టాలంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. కెప్టెన్సీకి సిద్దంగా ఉన్నానని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తెలియజేస్తేనే అతనికి జట్టు పగ్గాలు అప్పగిస్తారని అభిప్రాయపడ్డాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించాడు. అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ 2024 వరకు టీ20 కెప్టెన్‌గా కొనసాగాడు. దాంతో రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్ హార్దిక్ పాండ్యానేనని అంతా అనుకున్నారు.

హార్దిక్‌కు నిరాశే..
టీ20 ప్రపంచకప్ విజయంతో అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో హార్దిక్‌కు మార్గం సుగుమమైందని అంతా భావించారు. కానీ ఈ ప్రపంచకప్ విజయానంతరం హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో జట్టులో చాలా మార్పులు జరిగాయి.
వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను జట్టు లీడర్‌షిప్ గ్రూప్ నుంచి తప్పించారు. హార్దిక్‌ను తప్పించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా 16 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించగా.. భారత్ 11 విజయాలు సాధించింది. కానీ హార్దిక్‌ను పక్కనపెట్టిన గంభీర్.. టీ20 సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించాడు. దాంతో హార్దిక్‌కు కెప్టెన్ అయ్యే అవకాశాలు లేకుండా పోయాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేనే..
ఈ వ్యవహారంపై తాజాగా మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హార్దిక్ రాణిస్తే.. అతనే సారథ్య బాధ్యతలు చేపడుతాడని తెలిపాడు. 'టీమిండియా మేనేజ్‌మెంట్ మారినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టినవారు ఎవరైనా విభిన్నంగా వ్యవహరిస్తారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాలంటే.. అందుకు సిద్దంగా ఉన్నాననే విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలియజేయాలి.
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేనే కెప్టెన్సీ స్వీకరించడానికి కావాల్సిన అర్హతలు వస్తాయి. ఐసీసీ టోర్నీల్లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ అతను కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు.
పరుగులు చేస్తేనే..
ఆటగాళ్లు కెరీర్ మధ్య దశలో ఉన్నప్పుడు మరిన్ని ఎక్కువ పరుగులు చేయాలి. టీ20ల్లో ఇది ఆటగాళ్లపై భిన్నమైన ఒత్తిడిని కలగ జేస్తోంది. వన్డే క్రికెట్‌లో రాణించాలంటే మరింత ఫిట్‌గా ఉండాలి. ఆల్‌రౌండర్ అయితే 7 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేయాలి. బ్యాటింగ్‌లో ఐదు, లేదా ఆరో స్థానంలో బరిలోకి దిగి రాణించాలి. కాబట్టి ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ముఖ్యంగా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణించి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే హార్దిక్‌కు జట్టు సారథ్య బాధ్యతలు దక్కుతాయి.'అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.