భారత టీ20 టీమ్‌లోకి శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్
ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన టీమిండియాపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. జట్టు నిండా ఆల్‌రౌండర్లే ఉన్నారని, మిడిలార్డర్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్ల అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను తిరిగి పొట్టి ఫార్మాట్‌లోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డాడు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ 0-2 తేడాతో సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వరుసగా 16 సిరీస్ విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ పరాజయం తర్వాత భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు స్వదేశీ పిచ్‌లపై రాణిస్తున్నప్పటికీ.. విదేశీ పిచ్‌ల పరిస్థితులకు అలవాటు పడేందుకు వారికి మరింత సమయం కావాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి రాణించే నైపుణ్యం కలిగిన 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ వంటి క్లాస్ ప్లేయర్ అవసరం ఇప్పుడు జట్టుకు ఉందని తెలిపాడు. 'గతంలో ఆల్‌రౌండర్ల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ, గంభీర్ వచ్చాక ఆల్‌రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. భారత జట్టుకు ప్రధాన మిడిలార్డర్ బ్యాటర్లు అవసరం. శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడాడు. నేను అతని కెప్టెన్సీ గురించి మాట్లాడటం లేదు. కానీ, ఇలాంటి ప్లేయర్లను మాత్రం పొట్టి ఫార్మాట్‌లోకి మళ్లీ తీసుకురావాలి. ఐర్లాండ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే సత్తా అతనికి ఉంది. ఇంగ్లండ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడు. గతంలోనే అతను ఎలా ఆడాడో చూశాం.’అని సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఇప్పటికే ఓపెనింగ్ స్లాట్ కోసం ఎదురు చూస్తున్న వైభవ్ సూర్యవంశీని కాదని శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని సంజయ్ మంజ్రేకర్ సూచించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ 3-0తో సిరీస్ విజయాన్ని అందించడమే కాకుండా, 232 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ(154) కూడా ఉంది. అంతేకాకుండా, ఐపీఎల్ 2026 సీజన్‌లో 163.02 స్ట్రైక్ రేట్‌తో 732 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

