టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. ప్రెస్‌మీట్‌లో ఎలా వ్యవహరించాలో గంభీర్‌కు తెలియడం లేదని, అతని వద్ద సరైన సమాధానాలు లేవన్నాడు. అతన్ని మీడియా ముందుకు తీసుకురావద్దని బీసీసీఐకి సూచించాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఐదు టెస్ట్‌ల బోర్గర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరింది. ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ ఆటగాళ్లు విమానం ఎక్కగా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు రెండో బ్యాచ్ ఆటగాళ్లు నేడు(సోమవారం) బయల్దేరనున్నారు.

ఈ పర్యటనకు ముందు గౌతమ్ గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో ఎదురైన ఘోర పరాజయంపై స్పందించాడు. ఈ సిరీస్‌లో తమ జట్టు దారుణంగా విఫలమైందని అంగీకరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించడం లేదని, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంపైనే ఫోకస్ పెట్టామని చెప్పాడు. తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండట్లేదనే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. అతని గైర్హాజరీలో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తాడని చెప్పాడు. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడని, అతను బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు. రికీ పాంటింగ్ తమ ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకోవాలని, భారత క్రికెట్‌తో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దూకుడుగా గంభీర్ సమాధానాలు ఇచ్చాడు.
అయితే ప్రెస్‌మీట్‌లో గంభీర్ వ్యవహరించిన తీరును సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. మీడియా ముందుకు గంభీర్‌ను పంపించవద్దని ఎక్స్ వేదికగా బీసీసీఐకి సూచించాడు.
'గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ పూర్తిగా చూశాను. ఆయన్ని మీడియా ముందుకు తీసుకురాకపోవడమే మంచిది. హెడ్ కోచ్‌గా తెరవెనుక ఆయన పనిని చేసుకోనివ్వండి. మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు గంభీర్ వద్ద సరైన సమాధానాలు లేవు. తెలివిగా మాట్లాడుతున్నానని గంభీర్ అనుకొని ఉండొచ్చు. గంభీర్‌కు బదులు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు ప్రెస్‌మీట్లకు సరిపోతారు.'అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.