పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ ఆపేయడం ఉత్తమమని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఏం చేసినా పరుగులు రాని దశను ఎదుర్కొంటున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయడం ఆపేసి, విశ్రాంతి తీసుకోవడం బెటరని తెలిపాడు.
గత 6 నెలలుగా రోహిత్ శర్మ పరుగులు చేయలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ మూడు మ్యాచ్‌లు ఆడి 31 పరుగులే చేశాడు. ఆఖరి టెస్ట్ తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలోనూ అదే తడబాటు కొనసాగించిన రోహిత్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ విఫలమయ్యాడు. 7 బంతుల్లో 2 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు రోహిత్ శర్మ వైఫల్యం ఆందోళనకు గురిచేస్తోంది.

హిట్ మ్యాన్ బ్యాటింగ్ గురించి అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సంజయ్ బంగర్ అతను ప్రాక్టీస్ మానేసి తన పాత బ్యాటింగ్ వీడియోలు చూడాలని చెప్పాడు. పరుగుల కోసం అతిగా ఆలోచించవద్దని సూచించాడు. 'ప్రస్తుతం ఏం చేసినా పరుగులు రాని దశను రోహిత్ శర్మ ఎదుర్కొంటున్నాడు. కొన్నిసార్లు అతి ప్రాక్టీస్ కూడా నష్టం చేస్తోంది. ఇలాంటి దశలో ప్రాక్టీస్ ఆపేసి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.
ఒంటరిగా తాను అద్భుతంగా ఆడిన వీడియోలను చూడాలి. అప్పుడెందుకు బాగా ఆడానో అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. రిథమ్ అందుకోవడానికి ఉపయోగపడుతోంది. అలా కాకుండా రన్స్ కోసం ప్రయత్నిస్తే పరిస్థితి మరింత దిగజారుతోంది. పరుగుల కోసం రోహిత్ శర్మ అతిగా ఆలోచించవద్దు'అని సంజయ్ బంగర్ సూచించాడు.
ఇంగ్లండ్‌తో రెండో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాణించడం రోహిత్ శర్మతో పాటు టీమిండియాకు కీలకం. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అద్భుతమైన ఆరంభం దక్కితేనే టీమిండియా భారీ స్కోర్లు చేయగలుగుతోంది.