విశాఖ గ్యాస్ లీకేజీపై స్పందించిన క్రీడాలోకం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి విషవాయువుల లీకైన ఘటనపై క్రీడాలోకం స్పందించింది. ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, యువరాజ్ సింగ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ట్విటర్ వేదికగా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలంటూ వైజాగ్ ప్రజలకు సూచించారు.
స్టే స్ట్రాంగ్ వైజాగ్...
‘వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటనతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.' -విరాట్ కోహ్లీ
‘నిజంగా చాలా దురదృష్టకరమైన వార్త. వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన చాలా మంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి. బాధితులు త్వరగా కోరుకోవాలని ప్రార్ధిస్తున్నా. స్టే స్ట్రాంగ్ అండ్ సేఫ్ వైజాగ్’ -సానియా మీర్జా
‘వైజాగ్ గ్యాస్ లీక్ వార్తతో షాక్‌కు గురయ్యా. ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉంది. వారి కుటుంబాలకు, శ్రేయోభిలాషులకు సంతాపం ప్రకటిస్తున్నా. విశాఖ పట్నం బాగుండాలని మనమంతా ప్రార్దిద్దాం.’ -శిఖర్ ధావన్
‘వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. అస్వస్థత గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా’- హార్దిక్ పాండ్యా

హృదయ విదారక దృశ్యాలు..
గురువారం తెల్లవారుఝామున సంభవించిన విష వాయువు లీకేజీ ప్రమాదంలో మధ్యాహ్నం వరకు 10 మంది చనిపోగా, సుమారు 350 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు హుటాహుటిన చుట్టుపక్కల 5 గ్రామాలను ఖాళీ చేయించారు.
ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఊపిరాడక, పసిపిల్లలతో సహా ప్రాణభయంతో పరుగులు తీస్తూ.. అక్కడిక్కడే కుప్పకూలుతున్న హృదయ విదారక దృశ్యాలు పలువురిని కలచి వేస్తున్నాయి.

మృతుల కుటుంబాలకు కోటి సాయం..
మరోవైపు ఈ గ్యాస్ లీక్ దుర్ఘటన విషయం తెలియగానే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ కమిటీని నియమించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఆరేళ్ల చిన్నారి నుంచి 73 సంవత్సరాల వయసున్న వృద్ధుడి వరకు అన్ని వయసులవారు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications