పాకిస్థాన్ మాజీ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను వివాహమాడాడు. ఓవైపు సానియా మీర్జాతో విడాకులపై వదంతులు ప్రచారం అవుతుండగానే.. మరోవైపు షోయబ్ మాలిక్ పెళ్లి వార్త అభిమానులను షాక్‌కు గురి చేసింది.
అసలు సానియా మీర్జా-షోయబ్ మాలిక్ అధికారికంగా విడాకులు తీసుకున్నారా? అనే చర్చ కూడా మొదలైంది. గత ఏడాదిగా ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. సానియా మీర్జాతో కాపురం చేస్తూనే నటి సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ వివాహేతర సంబంధంపై సానియా నిలదీసిందని, అతను సరైన సమాధానం చెప్పకపోవడంతోనే వదిలేసి భారత్‌కు వచ్చిందని కూడా ప్రచారం జరిగింది.

తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. షోయబ్ మాలిక్.. సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. 28 ఏళ్ల సనా జావేద్‌కు కూడా ఇది రెండో వివాహం. మూడేళ్ల క్రితం (2020లో) ఉమైర్ జస్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో అతనికి దూరంగా ఉన్న ఆమె షోయబ్ మాలిక్‌తో రహస్య కాపురం పెట్టినట్లు పాక్ మీడియా కోడై కూసింది.
ఇక షోయబ్ మాలిక్ వివాహంపై సానియా మీర్జా ఎలాంటి ప్రకటన, పోస్ట్ పెట్టలేదు. కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. తన కూతురు 41 ఏళ్ల షోయబ్ మాలిక్‌తో ముస్లిం చట్టం 'ఖులా' ప్రకారం విడాకులు తీసుకుందని చెప్పారు. ఖులా అనేది ఇస్లామిక్ న్యాయశాస్త్రం. దీని ద్వారా ఓ ముస్తిం మహిళ తన భర్త నుంచి ఏకపక్షంగా విడాకులు తీసుకోవచ్చు.
షోయబ్ మాలిక్.. మూడో పెళ్లి గురించి తెలిసే సానియా మీర్జా తన సోషల్ మీడియా ఖాతాల్లో క్రిప్టిక్ పోస్ట్ పెట్టింది. 'పెళ్లి కష్టం.. విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి! లావుగా ఉండటం కష్టం.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. అప్పు ఉండటం కష్టం. ఆర్థిక క్రమశిక్షణతో ఉండటం కూడా కష్టమే. ఇతరులతో సత్సంబంధాలు ఉండటం.. లేకపోవడమూ కష్టమే. జీవితం ఎప్పుడూ సుభంగా ఉండదు. ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి.'అని సానియా వినూత్నంగా రాసుకొచ్చింది.
2010లో ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో కొడుకు పుట్టాడు.