ఐపీఎల్ ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలనడం సరికాదని రాజస్థాన్ రాయల్స్ వెటరన్ పేసర్ సందీప్ శర్మ అన్నాడు. ఇంత కంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదని అభిప్రాయపడ్డాడు . ఐపీఎల్‌లో జట్టును నడిపించడం, టీమిండియాకు సారథ్యం వహించడం ఒకటి కాదన్నాడు. ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కని విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేసినా..భారత టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్, విశ్లేషకులు తప్పుబట్టారు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడని, టీమిండియా కెప్టెన్‌గా నియమించాల్సిన ఆటగాడిని జట్టులోకి తీసుకోరా? అని విమర్శలు గుప్పించారు. టీమిండియాను నడిపించాల్సిన ఆటగాడిని రాజకీయాలతో పక్కనపెడుతున్నారని మండిపడ్డారు.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సందీప్ శర్మ.. ఈ వాదన సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించినంత మాత్రాన శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియాకు కెప్టెన్ చేయాలనడం సరి కాదు. ఐపీఎల్ జట్టుకు సారథ్యం వహించడం, భారత జట్టును నడిపించడం పూర్తిగా భిన్నమైన విషయాలు. ప్రజలు ముందుగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. బీసీసీఐకి సొంత దేశీయ లీగ్ ఉంది. అక్కడ ఎంతో మంది ఆడుతుంటారు. కానీ అంతర్జాతీయ జట్టును ఎంపిక చేసేటప్పుడు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంచుకుంటారు.
ఆ 15 మంది ఆటగాళ్లను నడిపించే అత్యుత్తమ సారథిని ఎంపిక చేస్తారు. కానీ, ఐపీఎల్‌లో స్థానిక ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లతో మిశ్రమ జట్టు ఉంటుంది. కాబట్టి ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్ చేయాలని అడగడం అర్థరహితం.'అని సందీప్ శర్మ చెప్పుకొచ్చాడు.
సందీప్ శర్మ అభిప్రాయం పక్కన పెడితే.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ అద్భుతంగా ఉంది. అతను ఐపీఎల్‌లోనే కాకుండా దేశవాళీ టోర్నీల్లో కూడా ముంబైని అద్భుతంగా నడిపించాడు. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా 5 మ్యాచ్‌ల్లో 325 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టిన అయ్యర్.. పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చాడు.