టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ వరల్డ్ బెస్ట్ క్రికెటర్స్ అని కొనియాడాడు. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జులై 27 నుంచి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే శ్రీలంక వెళ్లిన టీమిండియా.. సన్నాహకాలు ప్రారంభించింది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను చేపట్టాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.

భారత్‌తో సిరీస్‌ల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు సనత్ జయసూర్యను తాత్కలిక కోచ్‌గా నియమించింది. కెప్టెన్‌గా వానిందు హసరంగాపై వేటు వేసి చరిత్ అసలంకకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ సిరీస్ నేపథ్యంలో మాట్లాడిన జయసూర్య. రోహిత్, కోహ్లీలపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గైర్హాజరీని అడ్వాంటేజ్‌గా మార్చుకుంటామని చెప్పాడు.
'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ క్రికెటర్స్. సుదీర్ఘ కాలంగా టీమిండియా విజయాల్లో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. జడేజా సైతం అసాధారణమైన ఆల్‌రౌండర్. ఈ ముగ్గురి గైర్హాజరీ టీమిండియాకు నష్టమే. వారి గైర్హాజరీని మేం అడ్వాంటేజ్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం.'అని జయసూర్య తెలిపాడు.
పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జులై 27, 28, 30న మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్ట్ 2 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. రోహిత్, విరాట్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ పర్యటన నుంచి విశ్రాంతివ్వగా.. జడేజాను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు.