
కార్డిఫ్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తన ఫుట్ బాల్ స్కిల్స్‌ను ప్రదర్శించి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేశాడు. బంతిని కాలితో తన్నిన సామ్ స్టన్నింగ్ రనౌట్‌తో శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక(3)ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. సామ్ కరన్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫీదా అవుతున్నారు. వాటే కిక్ అంటూ కొనియాడుతున్నారు. క్రికెట్‌లో కూడా ఫుట్‌బాల్ ఆడొచ్చని సామ్ నిరూపించాడని, అతని సమయస్పూర్తికి సలామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 5 వికెట్లతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్(39), కెప్టెన్ కుశాల్ పెరీరా (21) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా.. సామ్ కరన్, క్రిస్ జోర్డాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 12 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగుల చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. దాంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 18 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలోనే 5 వికెట్లకు 108 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. లివింగ్ స్టోన్(29), సామ్ బిల్లింగ్స్(24) రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన తొలి టీంలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.