మాది చెత్త జట్టే.. మీది తోపు టీమ్ అయితే ఆసీస్‌ను ఎందుకు ఓడించలేదు:పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సరిగ్గా ఆడటం లేదని అంగీకరించిన సల్మాన్ బట్.. ఇంగ్లండ్ ఏమైనా బాగా ఆడుతుందా? అని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ ఎందుకు గెలవలేకపోతుంది?అని నిలదీసాడు. దమ్ముంటే ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలని చురకలంటించాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్.. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 171 పరుగులకే కుప్పకూలింది. దాంతో పాకిస్థాన్ జట్టుపై స్టువర్ట్ బ్రాడ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
పాక్ చెత్త టీమ్ అంటూ..
'పాకిస్థాన్ చెత్త జట్టు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అత్యంత బలహీనమైన టీమ్.
గత పర్యటనల్లో ఎదురైన ఫలితమే ఈసారి కూడా పాక్‌కు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ సునాయసంగా 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలి. ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ గెలవకపోతే అంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు.'అని బ్రాడ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లండ్ గొప్ప టీమ్ అయితే ఆసీస్ గడ్డపై గెలవాలి..
ఈ కామెంట్స్‌పై సల్మాన్ బట్ స్పందించాడు. 'పాకిస్థాన్ చెత్త టీమ్ అని స్టువర్ట్ బ్రాడ్ అంటున్నాడు. నిజమే.. ప్రస్తుతం పాకిస్థాన్ గొప్పగా ఆడటం లేదు. కానీ చెత్త టీమ్ అనే వ్యాఖ్య ఎందుకు? ఇంగ్లండ్ మంచి జట్టు అయితే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎదుకు గెలవలేకపోతుంది. వరుసగా 5-0తో ఎందుకు క్లీన్ స్వీప్ అవుతుంది.?
పాకిస్థాన్‌కు మంచి బౌలింగ్ అటాక్ ఉన్నప్పుడు.. ఇంగ్లండ్ బౌలర్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవారు. ఆ సమయంలో ఏ పాకిస్థాన్ ఆటగాడు కూడా ఇంగ్లండ్ చెత్త టీమ్ అని అనలేదు. ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆలోచన విధానమే ఇలా ఉంటుంది. ఇతరుల గురించి మాట్లాడే ముందు విదేశాల్లో ఇంగ్లండ్ కనబర్చిన ప్రదర్శనల గురించి చెప్పాలి.'అని సల్మాన్ బట్ ఘాటుగా బదులిచ్చాడు.
భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్..
లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 171 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇమామ్ ఉల్ హక్(42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/51), జోష్ టంగ్(5/46) ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.
అనంతరం ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది. జోర్డాన్ కాక్స్(73), కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), డాన్ లారెన్స్ సత్తా చాటారు. క్రీజులో జేమి స్మిత్(16 బ్యాటింగ్)తో పాటు జోఫ్రా ఆర్చర్(0) ఉన్నారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్(5/92) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహ్‌జాద్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

