ఫహీమ్ అష్రఫ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో తమను ఓటమి నుంచి గట్టెక్కించాడని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. వరుసగా వికెట్లు పడటంతో తమపై ఒత్తిడి పెరిగిందని చెప్పాడు. తాము తీవ్ర ఒత్తిడిలో ఆడటం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37), బాస్ డీ లీడే(25 బంతుల్లో 4 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మిర్జా(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, సయీమ్ ఆయుబ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షాహీన్ షా అఫ్రిది ఒక వికెట్ తీసాడు.

అనంతరం పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ షాహిబ్‌జాదా ఫర్హాన్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), షహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(12), బాబర్ ఆజామ్(15), ఉస్మాన్ ఖాన్(0), షాదాబ్ ఖాన్(8), మహమ్మద్ నవాజ్(6) తీవ్రంగా నిరాశపర్చారు. ఓ దశలో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఓటమి దిశగా సాగింది. కానీ ఫహీమ్ అష్రఫ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ను గట్టెక్కించాడు.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సల్మాన్ అలీ అఘా.. బ్యాటింగ్‌లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 'మేం చాలా కష్టంగా ఈ మ్యాచ్ గెలవాల్సి వచ్చింది. ఈ గెలుపు క్రెడిట్ ఫహీమ్‌కే దక్కుతుంది. గెలుపు కోసం మేం బాగా ప్రయత్నించాం. ప్రత్యర్థి గట్టి పోటీనిస్తుందని మాకు తెలుసు. పరిస్థితులను చక్కగా అదుపు చేశాం. ఈ పిచ్‌పై 147 పరుగులు లక్ష్యం తక్కువే. గత 6 నెలలుగా మా స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.