
ఆకట్టుకున్న యువరాజ్, ఓజా:
భారత మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ (33 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భారత లెజెండ్స్ జట్టు బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్.. ఆర్ వినయ్‌కుమార్ (2/25), ప్రజ్ఞాన్ ఓజా (2/12), యువరాజ్ సింగ్ (2/15) ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ నజీముద్దీన్ (40) టాప్ స్కోరర్. ఇటీవలే రిటైర్మెంట్ ఇచ్చిన వినయ్‌కుమార్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లు ఓజా, యువరాజ్ బంతులకు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ వద్ద సమాధానమే లేకపోయింది.

రెచ్చిపోయిన వీరూ:
అనంతరం లక్ష్య ఛేదనలో మాజీ ఓపెనర్లు రెచ్చిపోవడంతో భారత్ లెజెండ్స్ జట్టు 61 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో సెహ్వాగ్.. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఆపై కూడా బౌండరీల వర్షం కురిపించాడు. జోరు కొనసాగించిన వీరూ.. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతడికి తోడు మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా మెరవడంతో భారత్ 10.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. భారత జట్టుకు సారథ్యం వహించిన సచిన్.. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. మొత్తానికి ఇద్దరూ కలిసి అభిమానులను అలరించారు.

నాలుగు మ్యాచులు ముగిశాక:
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 క్రికెట్ టోర్నీ గతేడాదే కార్యరూపం దాల్చింది. అయితే కరోనా కారణంగా నాలుగు మ్యాచులు ముగిశాక అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులోకి రావడంతో ఈ టోర్నీ మళ్లీ పట్టాలెకింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. గతేడాది వాయిదా పడిన దగ్గరి నుంచే మొదలుకానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఈ టోర్నీ మార్చి 21 వరకు జరగనుంది.

ఇండియా లెజెండ్స్ జట్టు:
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, ప్రజ్ఞాన్ ఓజా, నోయెల్ డేవిడ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, మన్‌ప్రీత్ గోనీ, యూసుఫ్ పఠాన్, నమన్ ఓజా, ఎస్ బద్రీనాథ్, వినయ్ కుమార్.


Click it and Unblock the Notifications

నిబంధనలు అన్నీ పక్కన పెట్టి.. మీకు నచ్చింది చేయండి: జడేజా










