క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలకు బలయ్యాడు. డీఆర్‌ఎస్ లేకపోవడంతో అంపైర్ల నిర్ణయాలు సవాల్ చేసే అవకాశం సచిన్‌కు దక్కలేదు. అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వకపోతే సచిన్ మరిన్ని శతకాలు చేసేవాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తుంటారు.
24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 100 శతకాలు సాధించిన సచిన్‌కు లైఫ్‌లో ఒక అంపైర్ మాత్రం విలన్‌గా మిగిలిపోయాడు. అతను ఎవరో కాదు వెస్టిండీస్‌కు చెందిన స్టీవ్ బక్నర్. అతను ఇచ్చిన రెండు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా 2003లో గబ్బా, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో స్టీవ్ బక్నర్ ఇచ్చిన నిర్ణయాలను ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేరు.
భావోద్వేగాలను బాగా కంట్రోల్ చేసుకునే సచిన్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఔటైనా నిశబ్దంగానే వెళ్లిపోయేవాడు కానీ ఎలాంటి వాగ్వాదానికి దిగేవాడు కాదు. రూడీ కోర్ట్జెన్, డారిల్ హార్పర్, సైమన్ టాఫెల్ లాంటి అంపైర్లు కూడా సచిన్ విషయంలో చాలా సార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. కానీ స్టీవ్ బక్నర్ కారణంగా సచిన్ సెంచరీలు చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ఈ వివాదాస్పద నిర్ణయాలపై చాలా తక్కువగా స్పందించే టెండూల్కర్.. తాజాగా బక్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సందించాడు. రెడ్ ఇట్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా అభిమానులతో సచిన్ సరదాగా మాట్లాడాడు. ఈ సందర్భంగా స్టీవ్ బక్నర్ గురించి ఏదైనా చెప్పాలని ఓ అభిమాని అడగ్గా.. సచిన్ చిరునవ్వుతో సరదా వ్యాఖ్యలు చేశాడు. 'నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు బాక్సింగ్ గ్లోవ్స్ ఇవ్వండి. అప్పుడు ఆయన ఫింగర్ ఎత్తలేరు.'అని అన్నాడు. ప్రస్తుతం ఈ జోక్ నెట్టింట వైరల్‌గా మారింది.

2003 బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ పేసర్ జాసన్ గిల్లెస్పీ వేసిన బంతికి సచిన్ బ్యాట్ తగలకుండా పైకి ఎత్తాడు. అయితే బంతి ఎత్తుగా ప్యాడ్‌లను తాకినా, బక్నర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చేశాడు. రీప్లేలో మాత్రం ఆ బంతి స్టంప్స్ కంటె ఎత్తులో పోయినట్లు తేలింది. ఈ నిర్ణయానికి సచిన్ అవాక్కయ్యాడు. సచిన్ విషయంలో తాను చేసిన తప్పిదాలను ఓ ఇంటర్వ్యూలో బక్నర్ అంగీకరించాడు.
'నా తప్పుడు నిర్ణయాల వల్ల సచిన్ రెండు సార్లు ఔటయ్యాడు. ఏ అంపైర్ అయినా తప్పుడు నిర్ణయం ఇవ్వాలని అనుకోడు. అలా అనుకుంటే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. మానవ తప్పిదాలుగానే భావించాలి. ఒకసారి ఆస్ట్రేలియాలో ఎల్బీడబ్ల్యూ విషయంలో సచిన్‌ను ఔటిచ్చా. కానీ బంతి వికెట్ల కంటే హైట్ వెళ్లింది. మరోసారి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ ఔట్‌గా ఇచ్చాను. కానీ బంతి బ్యాట్‌కు దూరంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పు ఏది వినపడదు. ఎందుకంటే మ్యాచ్‌కు లక్షల్లో వస్తారు. ఆ తప్పిదాల పట్ల నేను ఇప్పటికి పశ్చాత్తాపానికి గురవుతాను. తప్పిదాలు చేయడం మానవసహజం.. వాటిని అంగీకరించడం కూడా జీవితంలో భాగమనేది నా అభిప్రాయం.'అని బక్నర్ చెప్పుకొచ్చాడు.