
రాయ్‌పూర్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. తనదైన ట్వీట్లతో అభిమానులను అలరిస్తుంటాడు. క్రికెట్‌కు సంబంధించిన ప్రతీ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటాడు. అయితే తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ క్రిస్ ట్రెమ్లెట్‌పై సచిన్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్‌కు సారథ్యం వహిస్తున్న సచిన్.. ఇంగ్లండ్ లెజెండ్స్ తరఫున ఆడుతున్న క్రిస్ ట్రెమ్లెట్‌తో ఫొటో దిగాడు.
ఈ ఫొటోను క్రిస్ ట్రెమ్లెట్ ట్వీట్ చేస్తూ 'ప్రస్తుతం నేను ఫిట్‌గా ఉన్నా.. సచిన్ వయసు వచ్చేసరికి అదే ఫిట్‌నెస్‌తో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటా'అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ట్రెమ్లెట్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సచిన్ వినూత్నరీతిలో కామెంట్ చేశాడు. సచిన్ ట్రెమ్లెట్ ఫిజిక్‌ను కొనియాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ట్రెమ్లెట్.. నేను నీలాగా ఉండాలంటే రోజుకు ఎన్ని ఆమ్లెట్స్ తినాలి?'అని 47 ఏళ్ల సచిన్ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. సచిన్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సచిన్ కన్నా 8 ఏళ్ల చిన్నవాడైన క్రిస్ ట్రెమ్లెట్ ఆరు అడుగుల ఏడు అంగుళాల పొడగరి. అతను తన ఫిజిక్‌ను కాపాడుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు. స్వతహగా మంచి బిల్డర్ అయిన ట్రెమ్లెట్ రోజుకు 8వేల కేలరీల ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. చూడగానే భారీ కాయంగా కనబడే 39 ఏళ్ల ట్రెమ్లెట్ ఇంగ్లండ్ తరపున 12 టెస్టుల్లో 50 వికెట్లు , 15 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. సచిన్ వయసు వచ్చే వరకు అతనిలా ఫిట్‌గా ఉంటే చాలని పేర్కొన్నాడు.
ఇక వరుస విజయాలతో జోరు కనబర్చిన ఇండియా లెజెండ్స్.. ఇంగ్లండ్ లెజెండ్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్.. కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత దిగ్గజాలు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులకే పరిమితమైంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఇండియా లెజెండ్స్‌కు ఓటమి తప్పలేదు.