
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ మూల్యం చెల్లించుకుంది. సమష్టిగా విఫలమై 7 వికెట్ల తేడాతో ఓటమి పాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అయితే టాస్ గెలిచిన సంజూ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైందని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా సచిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
'ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఇదే పిచ్‌పై తొలుత బౌలింగ్ చేసి అద్భుతంగా రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలియడం లేదు. బహుశా ఫైనల్ మ్యాచ్‌లో వాళ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకున్నారేమో.. అయితే, ఈ పిచ్‌పై గుజరాత్ టైటాన్స్ ఇంత వరకు ఆడలేదు.. రాజస్థాన్‌కు గతంలో ఆడిన అనుభవం ఉంది. నాకు తెలిసి రాజస్థాన్ మొదటి బౌలింగ్ చేసుంటే బాగుండేదేమో. కానీ గత మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేశాడు కదా.. అదే ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించి గుజరాత్‌కి భారీ టార్గెట్ ఇవ్వాలని రాజస్థాన్ అనుకుని ఉంటుంది'అని సచిన్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, 'ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్' హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.